పరువు నష్టం కేసులో కోర్టుకు రాహుల్ హాజరు
ABN , Publish Date - Feb 21 , 2026 | 03:57 PM
మహారాష్ట్రలో నమోదైన పరువు నష్టం కేసులో.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారంనాడు బివాండీ కోర్టుకు హాజరయ్యారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ కుంటే వేసిన పరువునష్టం కేసులో కొత్త పూచీకత్తు సమర్పించేందుకు రాహుల్ కోర్టుకు వచ్చారు.
భివాండి: మహారాష్ట్రలో నమోదైన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) శనివారంనాడు బివాండీ కోర్టుకు హాజరయ్యారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ కుంటే వేసిన పరువు నష్టం కేసులో కొత్త పూచీకత్తు సమర్పించేందుకు రాహుల్ కోర్టుకు వచ్చారు. రాహుల్‌కు మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్దన్ సక్పాల్ పూచీకత్తు ఇచ్చారు. ఇంతకుముందు గ్యారెంటర్‌గా ఉన్న కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ చకుర్కర్ గత డిసెంబర్‌లో కన్నుమూశారు. దీంతో కొత్త పూచీకత్తును కోర్టుకు సమర్పించేందుకు రాహుల్ హాజరయ్యారు. లీగల్ ప్రొసీడింగ్స్‌లో భాగంగా తాజా బెయిల్ బాండుపై రాహుల్ సంతకం చేశారు. ఈ కేసులో కొత్త గ్యారెంటర్‌గా సక్పాల్ కూడా హాజరయ్యారు.
రాహుల్ తరఫున న్యాయవాది నారాయణ అయ్యర్ మాట్లాడుతూ, బెయిల్ ఫార్మాలిటీస్ పూర్తి చేశామని చెప్పారు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని, ఈ కేసులో తమకు న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో జరగనున్న విచారణలకు రాహుల్ వ్యక్తిగతంగా హాజరుకావడం నుంచి శాశ్వత మినహాయింపు మంజూరైందని, సరైన సమయంలో డిఫెన్స్ సాక్ష్యాలను కోర్టుకు సమర్పిస్తామని చెప్పారు.
కేసు ఏమిటంటే..
2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మహారాష్ట్రలోని సోనాలే గ్రామంలో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ హత్య వెనుక ఆర్ఎస్ఎస్ హస్తం ఉందని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయంటూ ఐపీసీ సెక్షన్ 500 కింద రాహుల్‌పై.. రాజేష్ కుంటే పరువు నష్టం కేసు వేశారు.
ఇవి కూడా చదవండి..
రాహుల్‌కు నల్లజెండాలతో బీజేపీ కార్యకర్తల నిరసన
ఉగ్ర ముప్పు.. ఢిల్లీలో హైఅలర్ట్..