వైఫల్యాలను అంగీకరించిన మోదీ
ABN , Publish Date - Nov 21 , 2026 | 01:07 AM
పన్నుల్లో రాయితీలు ఇస్తున్నా ఉద్యోగాలను కల్పించడం లేదంటూ పారిశ్రామికవేత్తలపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం కాంగ్రెస్ నేతలు స్పందించారు
ఆర్థిక దుస్థితికి ఆయనే కారణం
గుత్తాధిపత్యం ఇచ్చాక ఇంకెక్కడి ఉద్యోగాలు?
రాహుల్, ఖర్గే విమర్శలు
న్యూఢిల్లీ, నవంబరు 20: పన్నుల్లో రాయితీలు ఇస్తున్నా ఉద్యోగాలను కల్పించడం లేదంటూ పారిశ్రామికవేత్తలపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం కాంగ్రెస్ నేతలు స్పందించారు. ఈ ఆర్థిక దుస్థితికి పారిశ్రామికవేత్తలు బాధ్యులు కారని, ప్రధాని వైఫల్యాలే కారణమని విమర్శించారు. ఈ విధంగా ప్రధాని తన వైఫల్యాలను అంగీకరించారని వ్యాఖ్యానించారు. ప్రధాని వ్యాఖ్యలు పారిశ్రామికవేత్తలపై చేసిన ఆరోపణలు కాదని, గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహించి పోటీ తత్వాన్ని లేకుండా చేశానంటూ మోదీ వ్యక్తం చేసిన పశ్చాత్తాపమని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ‘చిన్న వ్యాపార సంస్థలు, చిన్న పరిశ్రమలే ఉద్యోగాలు సృష్టిస్తాయి. నోట్ల రద్దు, లోపభూయిష్ట జీఎస్టీతో వాటిని నాశనం చేశారు. సమాన అవకాశాలు లేకుండా చేసి నిజాయితీగా వ్యాపారం చేసే పెద్ద సంస్థలకు నష్టం కలిగించారు. గుత్తాధిపత్యం ఉద్యోగాలను కల్పించదు. ధరల పెరుగుదలకు, పోటీని నిర్మూలించడానికి కారణమవుతుంది’ అని ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఎట్టకేలకు 12 ఏళ్ల తరువాత మేల్కొన్న మోదీ తన వైఫల్యాలను పారిశ్రామికవేత్తలపై నెట్టివేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్‌లో విమర్శించారు. పోటీ తత్వం లేకుండా చేయడంతో నూతన ఆవిష్కరణలకు అవకాశం లేకుండా పోయిందని, వస్తువుల నాణ్యత దెబ్బతిని అంతర్జాతీయ మార్కెట్లో విలువ పడిపోయిందని ఆరోపించారు. ‘భారత్‌లో తయారీ’ అన్న నినాదం ‘చైనా నుంచి కొనుగోలు’గా మారిందని విమర్శించారు.
కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరిపిస్తామన్న సూచనలు పంపుతూ పారిశ్రామికవేత్తల్లో భయాందోళనలు కలిగించారని వ్యాఖ్యానించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఎక్స్‌లో పోస్టు పెడుతూ ‘ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ఎంత ఇచ్చినా మీ ఆకలి తీరడం లేదని అన్నారు. చాలా బాగా చెప్పారు. కానీ మొత్తం దేశానికి తెలుసు. ఈ ఆకలి ఎవరిదో అని. వారికి విమానాశ్రయాలు, పోర్టులు, అడవులు, బొగ్గు, విద్యుత్తు, రోడ్లు అన్నీ ఇచ్చారు. కానీ వారు ఎన్ని ఉద్యోగాలు సృష్టించారు?’ అని ప్రశ్నించారు. 2024 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రభుత్వ వైఫల్యాలనే మోదీ ఇప్పుడు ప్రస్తావించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రతుల్ షా దేవ్ ఖండించారు.
ఇవి కూడా చదవండి..
ఇన్ఫ్లుయెన్సర్ ఇంట్లోకి చొరబడి పెళ్లి చేసుకోవాలని డిమాండ్.. యువకుడిని కొట్టి చంపిన ఫ్యామిలీ
తమిళనాడుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కావేరీ నీటి అభ్యర్థన తిరస్కరణ..