దేశ ఎన్నికల మ్యాప్‌నే మార్చే కుట్ర
ABN , Publish Date - Nov 29 , 2026 | 04:30 AM
లోక్‌సభ స్థానాలను 543 నుంచి 850కి పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు.
850కి పెంపుతో ప్రజాస్వామ్య హత్యకు ప్లాన్
బీజేపీకి అనుకూలంగా నియోజకవర్గాల పునర్విభజన
2011 జనాభా లెక్కలతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులకు 40 ఏళ్లు పాతరే
గత ఎన్నికల్లో 14 కోట్ల దొంగ ఓట్లతో గద్దెనెక్కిన మోదీ
మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ
న్యూఢిల్లీ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ స్థానాలను 543 నుంచి 850కి పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లు భారత ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఆందోళన వ్యక్తంచేశారు. 850 సీట్ల ప్రతిపాదన బీజేపీ సంధించిన ‘చివరి అస్త్రం’, ‘ఎేస్కప్ ప్లాన్’ అని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో రాహుల్‌గాంధీ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. దేశ ప్రజాస్వామ్య ఆత్మను ప్రధాని మోదీ కత్తితో పొడుస్తున్నారని, దేశాన్ని నియంతృత్వం వైపు నడిపిస్తున్నారని మండిపడ్డారు. డీలిమిటేషన్ పేరుతో దేశ మౌలిక నిర్మాణాన్ని నాశనం చేయవద్దని కేంద్రాన్ని హెచ్చరించారు. ఓట్ల చోరీలో దొరికిపోయి, ఇప్పుడు తమకు అనుకూలంగా నియోజకవర్గాల సరిహద్దులను ‘ప్యాక్ అండ్ క్రాక్’ పద్ధతిలో మార్చుకుని దేశ ఎన్నికల మ్యాప్‌ను తిరిగి గీసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని విమర్శించారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాలను పునర్విభజించి.. 2051 వరకు వాటిని ఫ్రీజ్ చేస్తే వచ్చే 40 ఏళ్లపాటు దేశంలో సామాజిక న్యాయాన్ని మర్చిపోవాల్సిందేనని అన్నారు. ఎస్సీ, ఎస్టీల జనాభా పెరిగినా, పాత లెక్కల వల్ల పార్లమెంటులో వారి సీట్లు పెరగవని, ఓబీసీలు, మైనారిటీల హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ఎన్నికల ముఖచిత్రాన్నే మార్చివేసేందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌కు ‘బ్లాంక్ కాన్వాస్’ అప్పగించబోతున్నారని ఆరోపించారు.
అమిత్ షా గీసిన మ్యాప్‌నే జ్ఞానే్‌షకుమార్ అమలు చేస్తారని, అమిత్ షా ఇప్పటికే మ్యాప్‌ను గీసి సిద్ధంగా ఉంచారని అన్నారు. ‘డీలిమిటేషన్ కమిషన్‌లో సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఉంటారు. మిగతా సభ్యులను మోదీ, షాలే నియమిస్తారు. కమిషన్ ఆదేశాలను ఏ కోర్టులోనూ ప్రశ్నించడానికి వీల్లేకుండా బిల్లు తెస్తున్నారు. అంటే పూర్తి అధికారం వారి చేతుల్లోనే ఉంటుంది’ అని తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికలే అక్రమం అని, నరేంద్రమోదీ ఓ ‘నకిలీ ప్రధాని’ అని రాహుల్‌గాంధీ ఆరోపించారు. గత ఎన్నికల్లో వారణాసిలోనూ ఆయన ఓడిపోయారని అన్నారు. గత ఏడాది కాలంలో ఎన్నికల సంఘం చేపట్టిన సర్‌లో ఏకంగా 14 కోట్ల ఓట్లను తొలగించారని, 2024లో మోదీకి ఓట్లు వేసిన 14 కోట్ల మంది అసలు చట్టబద్ధమైన ఓటర్లే కాదని ఈసీ లెక్కలే చెబుతున్నాయని పేర్కొన్నారు. దొంగ ఓట్లతో మోదీ గెలిచిన విషయాన్ని 80 శాతం మంది దేశ ప్రజలు, 100 శాతం జెన్‌జీలు గుర్తించారని అన్నారు. అందుకే జైలుకు పంపుతారన్న భయంతోనే ‘850’ అనే కొత్త ఎేస్కప్ ప్లాన్‌తో మోదీ వచ్చారని రాహుల్ ఆరోపించారు. లోక్‌సభ సీట్లను 543 వద్దే కొనసాగించాలని, 2027లో జరిగే కులగణన ఆధారంగానే డీలిమిటేషన్ చేపట్టాలని, జ్ఞానేష్ కుమార్ బృందం కాకుండా అఖిలపక్షంతో నిష్పక్షపాత కమిషన్ వేయాలని, పునర్విభజనతో సంబంధంలేకుండా ప్రస్తుతమున్న 543సీట్లలోనే ఓబీసీ సబ్-కోటాతో 33శాతం మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. డీఎంకే, టీడీపీ, జనసేన తదితర దక్షిణాది పార్టీలు డీలిమిటేషన్‌కు మద్దతును ఉపసంహరించుకోవాలని రాహుల్ విజ్ఞప్తి చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ సహా అందరూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు.
అబద్ధాల్లో రాహుల్‌కు సూపర్ పీహెచ్‌డీ: బీజేపీ
రాహుల్ విమర్శలను బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ తిప్పికొట్టారు. వరుస ఎన్నికల్లో ఓటమి పాలైన ఒత్తిడిలోనే రాహుల్ ఇలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, రాహుల్‌గాంధీ మహిళలకు వ్యతిరేకమని విమర్శించారు. అబద్ధాల్లో రాహుల్‌గాంధీకి ‘సూపర్ పీహెచ్‌డీ’ ఉందని విమర్శించారు.
ఇవి కూడా చదవండి...
ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం
21 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై హరీశ్ రావు, జగ్గారెడ్డి.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి