బీజేపీలోకి రాఘవ్ చద్దా.. లక్షల్లో తగ్గిన ఫాలోవర్లు
ABN , Publish Date - Apr 25 , 2026 | 03:44 PM
ఆప్ మాజీ నేత, ఎంపీ రాఘవ్ చద్దా బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన తీసుకున్న ఈ నిర్ణయంపై యువత నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. 24 గంటల వ్యవధిలోనే ఆయన సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్య భారీగా తగ్గింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం మీడియా, సోషల్ మీడియాలో ఆప్ మాజీ నేత, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పేరు మార్మోగిపోతోంది. సామాన్యుల పక్షాన పెద్దల సభలో గళం వినిపించిన రాఘవ్ చద్దాపై కొద్ది రోజుల క్రితం నెట్టింట్లో ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే నిన్న(శుక్రవారం) ఆయన ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఈ క్రమంలో ఆయన నిర్ణయంపై అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఆయన ఫాలోవర్ల సంఖ్య భారీగా తగ్గింది.
పార్టీ మారుతున్నట్లు ప్రకటించిన 24 గంటల్లోనే సోషల్ మీడియాలో రాఘవ్ చద్దా ఫాలోయింగ్ గణనీయంగా పడిపోయింది. ఈ ఎంపీకి ఇన్ స్టాగ్రామ్‌లో 14.6 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. శుక్రవారం నుంచి ఇవాళ్టి వరకు ఆ సంఖ్య 13.5 మిలియన్లకు తగ్గింది. రాఘవ చద్దా నిర్ణయాన్ని జెన్ జీ బ్యాచ్ వ్యతిరేకించడమే దీనికి కారణమై ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక చద్దాకు ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోయింగ్ తగ్గిపోవడంపై ఎన్సీపీ(ఎస్పీ) అధికార ప్రతినిధి అనీశ్ గవాండే స్పందించారు.
ఇంటర్నెట్ మిమ్మల్ని రాత్రికి రాత్రే హీరోగా మారుస్తుంది.. అలాగే ఓవర్ నైట్‌లోనే జీరోకి కూడా పడేయగలదని తెలిపాడు. రాఘవ్ చద్దా తీసుకున్న నిర్ణయం నచ్చక 10 లక్షల మంది యువత ఆయన సోషల్ మీడియాను అన్ ఫాలో చేశారని అన్నాడు. మొత్తంగా రాఘవ్ చద్దా నిర్ణయానికి యువత నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. ఆయన బీజేపీలో చేరడాన్ని మరికొంతమంది యువత సమర్థిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
కొత్త పార్టీ పేరు ప్రకటించిన కవిత..
ఆ కుటుంబంలో భాగమైనందుకు సిగ్గుపడుతున్నా: కవిత