Share News

బెంగాల్‌లో బీజేపే సునామీ.. 200 సీట్లకు పైనే గెలుస్తాం

ABN , Publish Date - Apr 25 , 2026 | 02:44 PM

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు అస్సాంకు కూడా కీలకమని, బంగ్లాదేశీయుల అక్రమ వలసల వల్ల హిందువులు త్వరలోనే మెజారిటీ కోల్పోనున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. బెంగాల్‌లో జరిగిన మొదటి విడత పోలింగ్‌లో బీజేపీకి వచ్చిన సపోర్ట్ చూస్తే 200కు పైగా సీట్లు గెలుచుకున్నా ఆశ్చర్యపడాల్సిన పనిలేదన్నారు.

బెంగాల్‌లో బీజేపే సునామీ.. 200 సీట్లకు పైనే గెలుస్తాం
Himanta Biswa Sharma

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు అస్సాంకు కూడా కీలకమని, బంగ్లాదేశీయుల అక్రమ వలసల వల్ల హిందువులు త్వరలోనే మెజారిటీ కోల్పోనున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sharma) అన్నారు. కోల్‌కతాలో మీడియాతో శనివారంనాడు ఆయన మాట్లాడుతూ, బెంగాల్‌లో జరిగిన మొదటి విడత పోలింగ్‌లో బీజేపీకి వచ్చిన సపోర్ట్ చూస్తే 200కు పైగా సీట్లు గెలుచుకున్నా ఆశ్చర్యపడాల్సిన పనిలేదన్నారు. రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా మారిపోయిందని, బీజేపీ సునామీ కనిపిస్తోందని చెప్పారు.


ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం చొరబాట్లను ప్రోత్సహించిందని శర్మ ఆరోపించారు. బంగ్లాదేశ్ సరిహద్దు ఫెన్సింగ్‌ కోసం బీఎస్ఎఫ్‌కు భూమిని టీఎంసీ కేటాయించలేదన్నారు. సురక్షిత భారతదేశం కావాలని కోరుకుంటే పశ్చిమబెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం వచ్చితీరాలని, చొరబాట్లను ఆపకుంటే దేశంలోని ఈశాన్య ప్రాంత మొత్తం బంగ్లాదేశ్‌లో భాగమవుతుందని హెచ్చరించారు. రెండో విడత పోలింగ్‌లోనూ బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు.


రెండు రాష్ట్రాలకూ కీలకం

ఈ ఎన్నికలు పశ్చిమబెంగాల్‌తో పాటు అస్సాంకూ కీలకమని, భౌగోళిక మార్పు తమకు అతిపెద్ద సవాలుగా ఉందని చెప్పారు. 'ఐదు రాష్ట్రాలతో ఇండో-బంగ్లాదేశ్ సరహద్దులున్నాయి. పశ్చిమబెంగాల్, త్రిపుర, మేఘాలయ, మిజోరం, అస్సాం. ఈ ఐదు రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్ర సరిహద్దులు తెరిచినా అది ఇతర రాష్ట్రాలపై ప్రభావం చూపుతుంది. బిహార్, జార్ఖాండ్‌పై కూడా ప్రభావం ఉంటుంది' అని వివరించారు. అస్సాంలో వేగంగా భౌగోళిక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ప్రస్తుతం 60 శాతం హిందువులు, 40 శాతం హిందువులు ఉన్నారని, రాబోయే రెండేళ్లలో పశ్చిమబెంగాల్, అస్సాంలో హిందువులు మెజారిటీ కోల్పోనున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అ తర్వాత బిహార్, జార్ఖాండ్‌కు కూడా విస్తరిస్తుందన్నారు. ఆ దృష్ట్యా ప్రస్తుత బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు తూర్పు, ఈశాన్యభారతానికి చాలా కీలకమని చెప్పారు.


అస్సాం అసెంబ్లీ ఎన్నికలు ఇటీవల ఒకే విడతలో జరుగగా, పశ్చిమబెంగాల్‌లో తొలి విడత పోలింగ్ ఈనెల 23న జరిగింది. రెండో విడత పోలింగ్ ఈనెల 29న జరుగుతుంది. మే 4న రెండు రాష్ట్రాల ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

బెంగాల్‌లో పోలింగ్‌ శాతం చూసి సంతోషించా

అరాచక పాలనకు అంతం తప్పదు

Updated Date - Apr 25 , 2026 | 02:50 PM