లంచం డిమాండ్ చేశారని విషం తాగిన యువకుడు.. పంజాబ్ బర్నాలాలో ఘటన
ABN , Publish Date - Sep 24 , 2026 | 06:04 PM
పోలీసులు లంచం డిమాండ్ చేశారని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్‌లో ఓ యువకుడు విషం తాగాడు. ఈ ఘటన పంజాబ్‌లోని బర్నాలాలో జరిగింది.
ఇంటర్‌నెట్ డెస్క్: పోలీసులు లంచం డిమాండ్ చేశారని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్‌లో ఓ యువకుడు విషం తాగాడు. పంజాబ్‌లోని బర్నాలాలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 11న జోబన్‌ప్రీత్ సింగ్ అనే యువకుడి కారుకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన రిపోర్టు కాపీని తీసుకోవడానికి ఆయన గురువారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అయితే.. స్టేషన్ హౌస్ ఆఫీసర్‌తో పాటు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లంచం ఇవ్వాలని తనను వేధిస్తున్నారని ఆయన ఆరోపించాడు. గత 14 రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా తనకు కాపీ ఇవ్వడం లేదన్నాడు. దీంతో గత్యంతరం లేక విషం తాగుతున్నానని చెప్పాడు. ఈ మేరకు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
వివాదాస్పదంగా వీడియో
జోబన్‌ప్రీత్ సింగ్ వీడియో వైరల్‌గా మారడంతో పాటు వివాదాస్పదంగానూ మారింది. ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీతనం లోపించిందని, అవినీతి పెరిగిందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ నేత సుఖ్‌జిందర్ సింగ్ రంధావాతో పాటు శిరోమణి అకాలీ దళ్ నేతలు కూడా డిమాండ్ చేశారు. అయితే, జోబన్‌ప్రీత్ ఆరోపణలను పోలీసులు ఖండించారు.
జోబన్ కుటుంబంలో ఆస్తి వివాదాలు ఉన్నాయని, అంతేకాకుండా అతను మానసిక ఒత్తిడితో బాధపడుతున్నాడని చెప్పారు. ‘కారు ప్రమాదానికి సంబంధించిన కాపీని తీసుకోవడానికి జోబన్.. పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. ఆ సమయంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను కలవాల్సి ఉందన్నాడు. అప్పుడు ఆ ఆఫీసర్ వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నారు. దీంతో కాసేపు ఎదురుచూడాలని ఆ ఆఫీసర్ చెప్పారు. అంతలోనే జోబన్ విషం తాగాడు. అతడిని ఆసుపత్రికి తరలించాం. ప్రమాదం నుంచి బయటపడ్డాడని డాక్టర్లు చెప్పారు’ అని పోలీసులు తెలిపారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. రిపోర్టు కాపీని ఇవ్వకుండా పోలీసులు వేధిస్తున్నందువల్లే అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని చెప్పడం సరికాదన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు అభిజీత్ దీప్కే అల్టిమేటమ్.. 48 గంటల్లో రాజీనామా చేయకపోతే..
ఆ భయంకర సాఫ్ట్‌వేర్‌ని రద్దు చేయండి.. ఈసీఐనెట్ యాప్‌పై శశిథరూర్