ఆ భయంకర సాఫ్ట్‌వేర్‌ని రద్దు చేయండి.. ఈసీఐనెట్ యాప్‌పై శశిథరూర్
ABN , Publish Date - Sep 24 , 2026 | 03:30 PM
ఓటరు జాబితాలో కొత్త ఓటర్ల పేర్లను కలపడం, పాత ఓటర్ల పేర్లను తొలగించడం వంటివి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మెడ చుట్టూ మరో ఉచ్చు బిగుసుకోనుంది. ఎన్నికల సంఘం సాఫ్ట్‌వేర్ ఈసీఐనెట్ యాప్‌ను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ కోరారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ఓటరు జాబితాలో కొత్త ఓటర్ల పేర్లను కలపడం, పాత ఓటర్ల పేర్లను తొలగించడం వంటివి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మెడ చుట్టూ మరో ఉచ్చు బిగుసుకోనుంది. ఎన్నికల సంఘం సాఫ్ట్‌వేర్ ఈసీఐనెట్ యాప్‌ను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ కోరారు. కాగా.. ఓటరు జాబితాలను ప్రక్షాళించేందుకు ఆ జాబితాకు సంబంధించిన ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ను ఎన్నికల సంఘం నిరుడు ప్రారంభించిన విషయం తెలిసిందే. తర్వాత ఈ ఏడాది జనవరిలో ఈసీఐనెట్ అనే యాప్‌ను ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఈసీఐనెట్ యాప్ ద్వారా ఓటర్లు తమ వివరాలను సమర్పించి అప్‌డేట్ చేసుకోవాలని ఈసీ సూచించింది. దీంతో ఓటర్లు ఆ యాప్ ద్వారా తమ వివరాలు సమర్పించారు. ఓటర్ల వివరాలను ప్రాసెస్ చేయడానికి ఆ యాప్‌ను అధికారులు ఉపయోగించారు. అయితే, నిరుడు నవంబరులో బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ యాప్‌కు సంబంధించిన బీటా వర్షన్‌ను అధికారులు పరీక్షించారు. అలాగే, పోర్టల్‌ను కూడా ఉపయోగించారు.
ఇద్దరు ఎన్నికల కమిషనర్ల అభ్యంతరం
ఇదిలా ఉండగా.. ఈసీఐనెట్‌ను కేంద్రీకృతం చేయడంపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బిర్ సింగ్ సంధూ, వివేక్ జోషి అభ్యంతరం వ్యక్తం చేశారని, గోవాలో క్షేత్రస్థాయి అధికారులను తగ్గించడంపైనా ఆ ఇద్దరు కమిషనర్లు హెచ్చరించారని ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికలో కథనం ప్రచురితమైంది. అలాగే, గోవాలో వివిధ ప్రభుత్వ పథకాలకు అర్హతను నిర్ధారించడానికి ఓటరు జాబితానే కీలకం. అలాంటి కీలక ఓటరు జాబితాలో పేరు లేకపోవడమంటే చాలా ప్రభుత్వ పథకాలు కోల్పోవాల్సి వస్తుందని ఓటర్లలో ఆందోళన నెలకొంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభ్యంకాని డయాలిసిస్, యాంజియోప్లాస్టీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, ట్రాన్స్‌ప్లాంట్లు, కీమోథెరపీ వంటి సూపర్ స్పెషాలిటీ చికిత్సకు నిధులు సమకూర్చే ‘గోవా మెడిక్లెయిమ్ స్కీమ్’ ఈ రాష్ట్ర ఓటర్లకు మాత్రమే అందుబాటులో ఉందని ఆ కథనం తెలిపింది. సర్ కింద తుది ఓటరు జాబితాను ప్రచురించడానికి నాలుగు రోజుల ముందు గోవా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్.. ఢిల్లీలోని ఎన్నికల సంఘానికి లేఖ రాశారని, అలా లేఖ రాయడం ఏడు రోజుల్లో అది ఎనిమిదో సారని కథనం వివరించింది. ‘సుప్రీంకోర్టు సూచించిన ప్రక్రియ ద్వారా గోవా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు (ఈఆర్ఓలు) అర్హులను నిర్ధారించారు. 97 మందితో కూడిన అర్హుల జాబితాను తయారు చేశారు. ఓటరు జాబితా నుంచి వారిని తొలగించాలని అంతకుముందు తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోవాల్సి ఉంది. అయితే, ఈసీఐనెట్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఈఆర్ఓలు ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకోలేకపోతున్నారు. దీనికి కారణం ఢిల్లీనే. నిర్ణయాలను వెనక్కి తీసుకునేందుకు అనుమతించాల్సింది ఢిల్లీ నుంచే’ అని ఆ ఆంగ్ల పత్రిక కథనం వివరించింది.
ఈ రిపోర్టుపై థరూర్ సీరియస్
ఆ ఆంగ్ల పత్రిక ఇచ్చిన నివేదికపై శశిథరూర్ సీరియస్ అయ్యారు. దానిని తీవ్రమైన అంశంగా, భారతీయ పౌరులకు రాజ్యాంగపరమైన హక్కులు దక్కకుండా చేయడం అని ఆయన అభివర్ణించారు. అంతేకాకుండా పేద, సామాన్య లబ్ధిదారులకు డయాలిసిస్, ట్రాన్స్‌ప్లాంట్ల వంటి చికిత్సలను అడ్డుకోవడమేనని ‘ఎక్స్’ లో థరూర్ విమర్శించారు. బాధిత పౌరులతో పాటు దేశ ప్రజలకు ఎన్నికల సంఘం క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అలాంటి భయంకరమైన సాఫ్ట్‌వేర్‌ను రద్దుచేయడం ఒక్కటే మార్గమని ఆయన సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
బిహార్‌లో దారుణం.. మరో బాలికపై లైంగిక వేధింపులు..
ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య కేసు.. వెలుగులోకి సీసీటీవీ దృశ్యాలు..