ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య కేసు.. వెలుగులోకి సీసీటీవీ దృశ్యాలు..
ABN , Publish Date - Sep 24 , 2026 | 10:27 AM
ఐఐటీ బాంబేలో విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పరీక్ష హాలులో సాహిల్ ఫోన్ వినియోగిస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
ముంబై: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే (IIT Bombay)లో విద్యార్థి సాహిల్ వాకోడే (22) ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పరీక్ష హాలులో సాహిల్ ఫోన్ వినియోగిస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వీడియో ప్రకారం.. సెప్టెంబర్ 18న పరీక్ష హాలులో నల్లటి టీ-షర్ట్ ధరించిన విద్యార్థి ముందు వరుసలో కూర్చొన్నాడు. ప్రొఫెసర్ సూర్యనారాయణ దుల్లా, మరికొంతమంది ఇన్విజిలేటర్లుగా ఉన్నారు.
ఈ సమయంలో సాహిల్ ఫోన్ వినియోగిస్తున్నట్లు ప్రొఫెసర్ దుల్లా గమనించారు. దీంతో అతని వద్దకు వెళ్లగా.. సాహిల్ కొద్దిసేపు లేచి నిలబడి, తిరిగి కూర్చున్నాడు. ఆ తర్వాత తన మొబైల్ ఫోన్‌ను ఇన్విజిలేటర్‌కు అప్పగించాడు. ఇద్దరి మధ్య కొంతసేపు సంభాషణ సాగింది. అనంతరం విద్యార్థి తన వస్తువులను తీసుకుని పరీక్ష హాలు నుంచి వెళ్లిపోయినట్లు వీడియోలో కనిపిస్తోంది. కాగా, అదే రోజు కొన్ని గంటల తర్వాత అతను తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, బాధిత తల్లిదండ్రులు వేధింపులు, కుల వివక్ష కారణంగానే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ పరిణామాలతో కొన్ని గంటల వ్యవధిలోనే ఐఐటీ బాంబే ఓ ప్రకటన జారీ చేసింది. పరీక్ష సమయంలో సాహిల్ ఫోన్ ఉపయోగించినట్లు తెలిపింది. ప్రశ్నపత్రాన్ని చాట్‌జీపీటీలో అప్‌లోడ్ చేసి సమాధానాలు పొందేందుకు ప్రయత్నించినట్లు సంస్థ పేర్కొంది. అయితే, అతనిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదని స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో ఐఐటీ బాంబేపై తీవ్ర విమర్శలు రావడంతో క్షమాపణలు చెప్పింది. మరోవైపు, ప్రొఫెసర్ దుల్లాను డీన్ ఆఫ్ స్టూడెంట్స్ వెల్ఫేర్ పదవి నుంచి సంస్థ తొలగించింది. అయితే, ఫ్యాకల్టీ సభ్యులు మాత్రం ప్రొఫెసర్ దుల్లాకు మద్దతు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
కొడుకు అరెస్టుతో తండ్రి నేర చరిత్ర వెలుగులోకి.!
గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సుకు మంటలు.. 9 మంది మృతి..