Share News

ఇథియోపియాలో అరెస్టయిన గ్యాంగ్‌స్టర్ గుర్వీందర్.. ఢిల్లీకి తరలింపు..

ABN , Publish Date - Nov 08 , 2026 | 10:23 AM

గ్యాంగ్‌స్టర్ గుర్వీందర్ అలియాస్ అఫ్రిదీని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 10 నెలల పాటు గాలింపు చర్యలు చేపట్టగా.. అతడు ఇథియోపియాలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇథియోపియాలో అరెస్టయిన గ్యాంగ్‌స్టర్ గుర్వీందర్.. ఢిల్లీకి తరలింపు..
Gangster Gurwinder

న్యూఢిల్లీ, నవంబర్ 8: గ్యాంగ్‌స్టర్ గుర్వీందర్ అలియాస్ అఫ్రిదీని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 10 నెలల పాటు గాలింపు చర్యలు చేపట్టగా.. అతడు ఇథియోపియాలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు (ఆదివారం) ఉదయం భారతదేశానికి తీసుకొచ్చారు. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవగానే పంజాబ్ పోలీసుల బృందం అతడిని తమ అధీనంలోకి తీసుకుంది.


ఈ సందర్భంగా డోనీ బల్-ప్రభ్ దస్సువాల్ గ్యాంగ్‌లో కీలక సభ్యుడైన అఫ్రిదీ.. విదేశాల్లో ఉంటూ ఇక్కడ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడిని పట్టుకునేందుకు 'ఆపరేషన్ షాహిద్' చేపట్టినట్లు తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు, విదేశాంగ శాఖ సహకారంతో పలు దేశాల్లో నిఘా, సమాచార సేకరణ, గాలింపు చర్యల అనంతరం అతడిని పట్టుకోగలిగామని వెల్లడించారు. అఫ్రిదీ 35 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, వీటిలో ఐదు హత్య కేసులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 2024లో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉండగా.. 2025లో ఏకంగా నాలుగు హత్య కేసుల్లో అతడి ప్రమేయం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నేరాల్లో అతడి పాత్రపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.


విదేశాల్లో ఉంటూ పంజాబ్‌లో హత్యలు, బెదిరింపులు, వసూళ్లతో పాటు కాల్పులకు పాల్పడటం వంటి నేర కార్యకలాపాలను అఫ్రిదీ నడిపిస్తున్నట్లు ఆరోపించారు. ఈ మేరకు అతడిపై ప్రభుత్వం రూ.5 లక్షల రివార్డు కూడా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. కాగా, ఈ ఆపరేషన్‌లో పంజాబ్ పోలీసుల యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్ (AGTF), కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగంలోని ఓవర్సీస్ ఫ్యుజిటివ్ ట్రాకింగ్ అండ్ ఎక్స్‌ట్రాడిషన్ సెల్ (OFTEC) సంయుక్తంగా పాల్గొన్నట్లు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

దీపావళి వేళ దేశ ప్రజలకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము శుభాకాంక్షలు..

నేడు వందేళ్ల వయసులోకి ఆడ్వాణీ

Updated Date - Nov 08 , 2026 | 10:27 AM