మహారాష్ట్రలో కల్తీ మద్యం కలకలం.. ఐదుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్!
ABN , Publish Date - May 30 , 2026 | 12:21 PM
మహారాష్ట్రలో కల్తీ మద్యం సేవించి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారంటూ ఐదుగురు పోలీసు అధికారులను తక్షణమే సస్పెండ్ చేసింది.
మహారాష్ట్ర, మే 30: కల్తీ మద్యం సేవించి 14 మంది మరణించిన ఘటన మహారాష్ట్రలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి దాపోడి పోలీస్ స్టేషన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సహా ఐదుగురు పోలీసు అధికారులను పింప్రి-చించ్వాడ్ పోలీస్ కమిషనర్ వినయ్ కుమార్ చౌబే ఇవాళ(శనివారం) సస్పెండ్ చేశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పింప్రి ఏసీపీ సచిన్ హిరే వెల్లడించారు. ఈ మరణాలు పుణె, పింప్రి-చించ్వాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదయ్యాయి.
స్థానికంగా కల్తీ మద్యం మాఫియా గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్న దందాపై ముందస్తు సమాచారం సేకరించడం.. వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో స్థానిక పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని విచారణలో తేలడంతో ఈ సస్పెన్షన్ వేటు పడింది. కల్తీ మద్యం సేవించి తమ కుటుంబసభ్యులు ప్రాణాలు కోల్పోవడంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ మద్యం విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులైన అధికారులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాధితుల బంధువులు, గ్రామస్థులు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు.
మరోవైపు.. NCP(SP) ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసు శాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని.. పోలీసులకు, ఈ చట్టవిరుద్ధ వ్యాపారం మధ్య సంబంధం ఉందని ఆయన ఆరోపించారు. 'మూడు రోజుల్లో, కల్తీ మద్యం కారణంగా కొందరు మృతిచెందారు. ఈ మరణాలకు గుండెపోటు, ఇతర కారణాలని పోలీసులు చెబుతున్నారు. ఇది.. ముమ్మాటికీ నిజాన్ని దాచిపెట్టి, ఈ కల్తీ దందా నడుపుతున్న వారిని రక్షించే ప్రయత్నంలా కనిపిస్తోంది. నమోదైన మరణాల కంటే ఇంకా ఎక్కువ మందే చనిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం, పుణె పోలీస్ శాఖ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోకపోతే.. ఈ కల్తీ వ్యాపారంలో పోలీస్ శాఖకూ ప్రమేయం ఉందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.' అని ఆయన విలేకరులతో అన్నారు.
ఇవి కూడా చదవండి..
మాజీ సుప్రీం లీడర్ ఖమేనీకి అంత్యక్రియలు.. భారీ ఏర్పాట్లు చేస్తున్న ఇరాన్..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే