తల్లిదండ్రులపై కొడుకుల దాడి.. భూమి అమ్మేశారని నడిరోడ్డుపై కర్రలతో కొట్టి..
ABN , Publish Date - Sep 02 , 2026 | 06:53 PM
మహారాష్ట్రలోని పుణెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భూమిని ఎందుకు విక్రయించారంటూ ఇద్దరు కొడుకులు తమ వృద్ధ తల్లిదండ్రులపై కర్రలతో దాడి చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని పుణెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భూమిని ఎందుకు విక్రయించారంటూ ఇద్దరు కొడుకులు తమ వృద్ధ తల్లిదండ్రులపై కర్రలతో దాడి చేశారు. భూమి అమ్మకాన్ని రద్దు చేయకపోతే చంపేస్తామంటూ బెదిరించారు. తల్లిదండ్రులు ఇద్దరినీ నడిరోడ్డుపై కర్రలతో కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Sons attack parents).
పుణె జిల్లా ఇందాపూర్ తాలూకాలోని తరంగ్‌వాడి గ్రామానికి చెందిన 65 ఏళ్ల రైతు తుకారాం కిసాన్ రౌత్ తన భార్య అంజనతో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో వారి ఇద్దరు కొడుకులు కారులో అక్కడికి వచ్చి తల్లిదండ్రులను అడ్డుకున్నారు. తల్లి అంజనా పేరుతో ఉన్న భూమిని ఎందుకు విక్రయించారంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. ఇద్దరు కొడుకులు కర్రలతో తండ్రి తుకారాం, తల్లి అంజనపై దాడి చేశారు. తుకారాంకు వీపు, ముఖం, తొడలు, ఎడమ భుజంపై గాయాలు కాగా.. అంజనకు కుడి మణికట్టు, నడుము ప్రాంతంలో గాయాలయ్యాయి (Elderly parents assaulted).
దాడి సమయంలో కొడుకులు తల్లిదండ్రులను దూషించడంతో పాటు, భూమి అమ్మకాన్ని రద్దు చేయకపోతే చంపేస్తామని బెదిరించారు (Pune land dispute). గొడవను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన దంపతులను ఇందాపూర్ సబ్-డిస్ట్రిక్ట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై తండ్రి తుకారాం రౌత్ ఫిర్యాదు చేయడంతో ఇందాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు కొడుకులపై కేసు నమోదైంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని సంజయ్ తుకారాం రౌత్, రాజేంద్ర తుకారాం రౌత్గా గుర్తించారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి
వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..