అమాయకులను నక్సల్స్‌గా మార్చిన వారిని జైల్లో వేశారా?
ABN , Publish Date - Nov 28 , 2026 | 03:19 AM
అమాయక ప్రజలను ఉద్యమం పేరుతో నక్సలైట్లుగా మార్చిన వారిని జైల్లో పెట్టారా?, వారిని ఆ మార్గంలో నడిపించిన వారిపై చర్యలు తీసుకున్నారా? అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశ్నించారు
అలాంటి వారిపై చర్యలు తీసుకున్నారా?
రాజ్యాంగ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశ్న
లొంగిపోయిన నక్సలైట్లను ఆదరించాలని పిలుపు
న్యూఢిల్లీ, నవంబరు 27: అమాయక ప్రజలను ఉద్యమం పేరుతో నక్సలైట్లుగా మార్చిన వారిని జైల్లో పెట్టారా?, వారిని ఆ మార్గంలో నడిపించిన వారిపై చర్యలు తీసుకున్నారా? అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశ్నించారు. నక్సలిజం వైపు ఆకర్షితులైన వారిని కొందరు ప్రభావితం చేసి బలవంతంగా ఉద్యమంలోకి లాక్కొచ్చారని అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టులో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఈ మేరకు వ్యాఖ్యానించారు. దేశం నేడు నక్సలిజం నుంచి విముక్తి పొందిందని పేర్కొన్న ముర్ము.. అందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. లొంగిపోతున్న నక్సలైట్లను తాను గమనించానని, వారి ముఖాలను చూస్తుంటే వారు అమాయకులుగా కనిపిస్తున్నారని అన్నారు. వారు తమంతట తాము నక్సలైట్లుగా మారలేదని, కొందరు వారిని ఆ మార్గంలో నడిపించారని అభిప్రాయపడ్డారు. అలాంటి సూత్రధారులను జైల్లో వేశారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘‘మనల్ని ఎందుకు నక్సలైట్లుగా మార్చలేదు? ఎంపిక చేసిన కొందరిని మాత్రమే ఎందుకు మార్చారు?.. ఈ విషయాన్ని లోతుగా అధ్యయనం చేయాలి. వారు సహజంగా అలాంటి స్వభావం కలిగిన వారు కాదు కాబట్టి ఆ అమాయకులకు మనమే తల్లిదండ్రుల్లా అండగా నిలవాలి. పిల్లలకు ఆకలిగా ఉందా? వారు ఎక్కడైనా నొప్పితో బాధ పడుతున్నారా? అని తల్లిదండ్రులకు ఏవిధంగా అయితే తెలుస్తుందో అదే విధంగా వారి బాధలను మనం అర్థం చేసుకోవాలి’’ అని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. అమాయక ప్రజలు నక్సలిజం వైపు ఎందుకు ఆకర్షితులవుతున్నారనే అంశంపై దృష్టి సారించాలన్నారు. లొంగిపోయిన నక్సలైట్లను కరుణతో చూడాలని, వారు తిరిగి సాధారణ జీవనంలోకి వచ్చేలా సమాజం బాధ్యత తీసుకోవాలని ముర్ము పిలుపునిచ్చారు.
ఈ వార్తలనూ చదవండి:
డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు
బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..