Share News

ప్రతి పౌరుడికీ వైఫై లక్ష్యంగా చర్యలు: పెమ్మసాని

ABN , Publish Date - May 26 , 2026 | 06:43 PM

ప్రతి పౌరుడికీ వైఫై లక్ష్యంగా పీఎం వాణి (PM WANI)సేవలు అందించాలని అధికారులను కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశించారు. 15, 30, 60 నిమిషాల ఇంటర్నెట్ వినియోగ ప్లాన్లు అందుబాటులోకి తీసుకురావాలని వారికి స్పష్టం చేశారు.

ప్రతి పౌరుడికీ వైఫై లక్ష్యంగా చర్యలు: పెమ్మసాని
Central Minister Pemmasani Chandrasekhar

న్యూఢిల్లీ, మే 26: పీఎం వాణి (PM WANI) ద్వారా ప్రతి పౌరుడికీ సులభమైన పబ్లిక్ వైఫై అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. మంగళవారం న్యూఢిల్లీలో పీఎం వాణి (PM WANI) అమలుపై ఉన్నతాధికారులతో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు, ప్రయాణికులు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులు సహా ప్రతి ఒక్కరికీ ప్రజా వైఫై కీలక ప్రజా సేవగా మారుతోందన్నారు. వినియోగదారులకు మరింత సులభతరం చేసేలా ల్యాప్ టాప్‌లు, ఇతర సెకండరీ పరికరాలకు క్యూఆర్ ఆధారిత లాగిన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.


మొబైల్ ద్వారా క్యూఆర్ స్కాన్ చేసి సులభంగా ల్యాప్‌టాప్‌ను కనెక్ట్ చేసుకునే విధంగా వ్యవస్థను రూపొందిస్తున్నామని చెప్పారు. తక్కువ సమయం ఇంటర్నెట్ అవసరమయ్యే వినియోగదారుల కోసం 15, 30, 60 నిమిషాల స్వల్ప కాల వినియోగ ప్లాన్లు ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్, మాల్స్, ప్రజా ప్రదేశాల్లో డిజిటల్ కనెక్టివిటీని మరింత సులభతరం చేయడమే లక్ష్యమన్నారు. పీఎం వాణి హాట్‌స్పాట్‌ల గుర్తింపును మరింత సులభతరం చేసేలా స్టాండర్డ్ నేమింగ్ విధానాన్ని తీసుకు వస్తున్నట్లు చెప్పారు.


ప్రజలకు మరింత వేగవంతమైన, సురక్షితమైన, నమ్మకమైన ఇంటర్నెట్ సేవలు అందించేందుకు పీఎం వాణి వ్యవస్థలో సమగ్ర మార్పులు చేపడుతున్నామని పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా లక్ష్యాలను అనుగుణంగా దేశంలో ప్రతి పౌరుడికి సులభమైన డిజిటల్ కనెక్టివిటీ అందుబాటులోకి తీసుకురావడమే తమ సంకల్పమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ సమావేశంలో పీఎం వాణి అమలు వేగవంతం, వినియోగదారుల అనుభవం మెరుగుదల, డిజిటల్ కనెక్టివిటీ విస్తరణ తదితర అంశాలపై అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైఎస్ అవినాష్ రెడ్డికి బీటెక్ రవి చురకలు

లొంగిపోయిన మావోయిస్టు దంపతులు.. చెక్కులు అందజేసిన డీజీపీ

Read Latest National News And Telugu News

Updated Date - May 26 , 2026 | 07:37 PM