Share News

దేశంలో నేతన్నల కుటుంబాలకు మద్దతు ఇవ్వాలి: ప్రజలకు మోదీ పిలుపు

ABN , Publish Date - Aug 07 , 2026 | 08:50 AM

జాతీయ చేనేత దినోత్సవం నేడు. ఈ నేపథ్యంలో నేతన్నలకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

దేశంలో నేతన్నల కుటుంబాలకు మద్దతు ఇవ్వాలి: ప్రజలకు మోదీ పిలుపు

హైదరాబాద్, ఆగస్టు 07: దేశంలో నేతన్నల కటుంబాలకు మద్దతు ఇవ్వాలని ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి నేతన్నలకు అండగా నిలవాలని ప్రజలకు ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నల కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఓ వీడియోను ప్రధాని మోదీ విడుదల చేశారు. చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని వారిని మోదీ కోరారు.


దేశంలో సాగు తర్వాత స్థానం చేనేతదే: కేంద్ర మంత్రి బండి

దేశంలో అతిపెద్ద కుటీర పరిశ్రమ చేనేత వస్త్ర పరిశ్రమ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నల కుటుంబాలకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. దేశంలో సాగు తర్వాత స్థానం చేనేతదేనని గుర్తు చేశారు. భారతీయ ఆత్మకు ప్రతిరూపం చేనేత అని అభివర్ణించారు. 'లోకల్ ఫర్ వోకల్'తో ప్రపంచస్థాయికి తీసుకెళ్లేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని అన్నారు. ఆగస్ట్ 07వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించిన ఘనత మోదీదేనని వివరించారు.


దాదాపు 10 కోట్ల మంది ప్రజలు చేనేత రంగంపై ఆధార పడ్డారని ఆయన పేర్కొన్నారు. భారతీయ చరిత్ర, సంస్కృతి, కళాత్మకతకు చేనేత ప్రతిరూపమని అన్నారు. అగ్గిపెట్టేలో చీర ఇమిడేలా తయారు చేసిన ఘనత ఉమ్మడి కరీంనగర్ జిల్లాదేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2 గంటల 50 నిమిషాల్లో ఏకబిగిన అగ్గిపెట్టెలో ఇమిడేలా చీర నేశారని పేర్కొన్నారు. మువ్వన్నెల జెండా నేసిన చేనేతకు రాష్ట్రంలో చేయూత కరువైందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.


‘మేక్ ఇన్ ఇండియా’తో చేనేతను బలోపేతం చేయడమే ప్రధాని మోదీ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. నేతన్నల వార్షిక ఆదాయాన్ని పెంచేలా కార్యాచరణ అమలు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు కేంద్రం మంత్రి బండి సంజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

Updated Date - Aug 07 , 2026 | 09:10 AM