Share News

బెంగాల్ ఉత్సాహమే తెలంగాణలో కనిపిస్తోంది... తదుపరి టార్గెట్‌పై సంకేతాలిచ్చిన మోదీ

ABN , Publish Date - May 10 , 2026 | 08:47 PM

పశ్చిమబెంగాల్‌లో ఘనవిజయం తరువాత తెలంగాణానే బీజేపీ టార్గెట్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరోక్ష సంకేతాలిచ్చారు. ఒకప్పుడు పరిమిత ప్రభావం కలిగిన పార్టీగా బీజేపీని అనుకునేవారని, ఇప్పుడు దక్షిణాది నుంచి ఈశాన్యం వరకూ బీజేపీ అధికారంలోకి ఉందని అన్నారు.

బెంగాల్ ఉత్సాహమే తెలంగాణలో కనిపిస్తోంది... తదుపరి టార్గెట్‌పై సంకేతాలిచ్చిన మోదీ
PM Modi

హైదరాబాద్: పశ్చిమబెంగాల్‌లో ఘనవిజయం తరువాత తెలంగాణానే బీజేపీ తదుపరి టార్గెట్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పరోక్ష సంకేతాలిచ్చారు. ఒకప్పుడు పరిమిత ప్రభావం కలిగిన పార్టీగా బీజేపీని అనుకునేవారని, ఇప్పుడు దక్షిణాది నుంచి ఈశాన్యం వరకూ బీజేపీ అధికారంలోకి ఉందని అన్నారు. దేశానికి అంకితం కావాలనే పార్టీ సిద్ధాంతాన్ని ఈ విజయాలు ప్రతిబింబిస్తున్నాయని ఆదివారంనాడిక్కడ జరిగిన బహిరంగ సభలో మోదీ పేర్కొన్నారు.


కాంగ్రెస్ పార్టీ అవినీతిని పెంచిపోషిస్తూ ఆనువంశిక పాలనకే పరిమితమై రాజ్యాంగబద్ధమైన సంస్థలను అణిచివేయాలని ప్రయత్నిస్తోందని మోదీ విమర్శించారు. పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ నియంతృత్వ మోడల్‌‌ను బీజేపీ చిత్తు చేసిందని చెప్పారు. వామపక్షాల ప్రతికూల అలవాట్లనే టీఎంసీ జీర్ణించుకుని బెంగాల్‌ను 'బందీ' చేసిందని, అయితే అభివృద్ధి సిద్ధాంతాన్ని ఎవరూ ఆపలేరని టీఎంసీ ఓటమి స్పష్టం చేసిందని చెప్పారు.


'ఇండియాలో ఏటా ఒక ఎన్నిక జరుగుతుంది. ఎవరో ఒకరు నెగ్గుతారు, ఇంకొకరు ఓడిపోతారు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు ఒక భాగం. అయితే బెంగాల్‌లో బీజేపీ గెలుపును ఇండియా అంతా సెలబ్రేట్ చేసుకోవడం, యావత్ ప్రపంచం చర్చించుకోవడం అసాధారణ విషయం. టీఎంసీ దాస్య శృంఖలాల నుంచి విముక్తి కావాలని ప్రజలు బలంగా కోరుకోవడమే ఇందుకు కారణం' అని అన్నారు.


తెలంగాణ ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారని, 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయినప్పుడు బీజేపీకి ఒక ఎంపీ మాత్రమే ఉండేవారని, ఇప్పుడు బెంగాల్‌లో కనిపించిన ఉత్సాహమే తెలంగాణలోనూ కనిపిస్తోందని అన్నారు. దేశంలోని నలుచెరగులా బీజేపీని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని అన్నారు. బీజేపీ అభివృద్ధి మోడల్‌కు పట్టంకడుతున్నారని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ సాధించిందని, పుదుచ్చేరిలో బీజేపీ-ఎన్డీయే ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిందని, వరుస విజయాల అనంతరం ఇప్పుడు తెలంగాణాలోనూ బీజేపీ ప్రభుత్వమే రావాలనే సెంటిమెంట్ బలంగా కనిపిస్తోందని మోదీ అన్నారు. అస్సాం నుంచి ఒడిస్సా వరకూ, బెంగాల్ నుంచి పుదుచ్చేరి వరకూ బీజేపీ విస్తరణ కేవలం రాజకీయ విస్తరణ కాదని, మార్పునకు సంకేతమని అన్నారు. పరివార్‌వాద్‌ను కాకుండా విశ్వాస్‌వాద్‌ను ప్రజలు కోరుకుంటున్నారని మోదీ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

తెలంగాణ వికసిస్తే.. దేశం కూడా వికసిస్తుంది: మోదీ

మోదీ కాన్వాయ్ మార్గంలో జిలెటిన్ స్టిక్స్

Updated Date - May 10 , 2026 | 08:55 PM