మోదీ కాన్వాయ్ మార్గంలో జిలెటిన్ స్టిక్స్
ABN , Publish Date - May 10 , 2026 | 04:18 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం బెంగళూరు పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్ వెళ్లే మార్గంలో జిలెటిన్ స్టిక్స్‌తో కూడిన ఒక బ్యాగ్‌ను పోలీసులు గుర్తించారు. దీంతో హైఅలర్ట్ ప్రకటించారు.
బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం బెంగళూరు పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్ వెళ్లే మార్గంలో జిలెటిన్ స్టిక్స్‌తో కూడిన ఒక బ్యాగ్‌ను పోలీసులు గుర్తించారు. దీంతో హైఅలర్ట్ ప్రకటించారు. బాంబు డిస్పోజల్, ఫోరెన్సిక్ బృందాలో రంగంలోకి దిగి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వెన్యూకు దారితీసే మార్గంలోని కగ్గలిపుర ప్రాంతంలోని తాతగుణి వద్ద ఈ పేలుడు పదార్ధాలను కనుగొన్నారు. ఇందుకు సంబంధించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
సెక్యూరిటీ అలర్ట్
ప్రధానమంత్రి 45వ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు బెంగళూరు వచ్చారు. ఆయన కాన్వాయ్ వెళ్లే మార్గానికి సమీపంలోనే జిలెటిన్ స్టిక్స్ కనిపించడంతో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వాహనాలను కొద్దిసేపు ఎక్కడికక్కడే నిలిపివేసి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. సెర్చ్ ఆపరేషన్‌లో ఒక బ్రిడ్జి సమీపంలో జిలెటిన్ స్టిక్స్‌ను కనుగొన్నారు. వీటిని ఉద్దేశపూర్వకంగానే అక్కడ ఉంచినట్టు ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే ఆ లొకేషన్‌కు ఎవరు, ఎలా తీసుకువచ్చారు, దీని వెనుక కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
నిర్బంధంలో అనుమానితుడు
ఈ కేసుకు సంబంధించి కొరమంగళ సమీపంలోని ఇంటి నుంచి ఒక వ్యక్తిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి ఆదివారం ఉదయం స్థానిక పోలీసు స్టేషన్‌కు ఫోన్ చేసి హెచ్ఏఎల్ ఎయిర్‌పోర్ట్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్ సమీపంలో పేలుళ్లకు అవకాశం ఉందని హెచ్చరించినట్టు అధికారులు చెబుతున్నారు. హెచ్ఏఎల్ విమానాశ్రయం వద్ద ఎలాంటి పేలుడు పదార్ధాలు దొరకనప్పటికీ, ఆ తరువాత ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్‌కు వెళ్లే మార్గం సమీపంలో జిలెటిన్ స్టిక్స్ కనిపించాయి. కాగా, పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్న వ్యక్తి గతంలోనూ విఐపీ పర్యటనల్లో ఇదే తరహా హెచ్చరికలు చేసినట్టు గుర్తించారు. అయితే అతను మానసిక సమస్యలతో బాధపడుతున్నాడంటూ గతంలో విడిచిపెట్టినప్పటికీ ఈసారి పేలుడు పదార్ధాలు దొరకడంతో ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
కాంగ్రెస్ డీఎంకేను వెన్నుపోటు పొడిచింది: ప్రధాని మోదీ
హైదరాబాద్‌లో మోదీ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం