ఇంధన సంక్షోభాన్ని అధిగమించాం
ABN , Publish Date - Nov 14 , 2026 | 04:43 AM
పశ్చిమాసియా యుద్ధ సమయంలో తలెత్తిన ఇంధన సంక్షోభాన్ని అధిగమించడంలో గత దశాబ్ద కాలంగా తీసుకున్న చర్యలు దేశానికి సహాయపడ్డాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు
గత దశాబ్దంలో తీసుకున్న చర్యలతోనే సాధ్యమైంది: ప్రధాని మోదీ
బెంగళూరు, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియా యుద్ధ సమయంలో తలెత్తిన ఇంధన సంక్షోభాన్ని అధిగమించడంలో గత దశాబ్ద కాలంగా తీసుకున్న చర్యలు దేశానికి సహాయపడ్డాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం కర్ణాటక పర్యటనకు వచ్చిన ఆయన బెంగళూరు ఎస్-వ్యాస యూనివర్సిటీ స్వర్ణోత్సవ భవనాన్ని ప్రారంభించారు. నమ్మ మెట్రోలో భాగంగా 7.5 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని జాతికి అంకితం చేశారు. రూ.15,600 కోట్ల అభివృద్ధి పనులను వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం మైసూరుకు వెళ్లి, కాస్మోస్ ప్లానెటోరియాన్ని ప్రారంభించారు. నమ్మ మెట్రో రైలులో తావరకెరె నుంచి ఐఐఎంబీ స్టేషన్ వరకూ ప్రయాణించారు. అనంతరం ఐఐఎంబీ మెట్రో స్టేషన్ వద్ద జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. భారతీయ రైల్వేలో కొత్త చరిత్ర మొదలైందని అన్నారు. రైల్వేస్టేషన్లు విమానాశ్రయాల తరహాలో రూపు దిద్దుకుంటున్నాయని, రైళ్ల సంఖ్య పెరగడంతో పాటు వందేభారత్ లాంటి హైస్పీడ్ రైళ్లు దేశమంతటా అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. దేశంలో మధ్యతరగతి ప్రజలు పెరిగారని, ఇళ్లల్లో రిఫ్రిజిరేటర్, టీవీ, పిల్లలకు ఉత్తమ విద్య, ఆరోగ్య సౌలభ్యాలు, పర్యాటకాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇదే దేశాభివృద్ధికి కొత్త ఇంజన్ అని మోదీ అభివర్ణించారు.
ఇవి కూడా చదవండి..
నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే సోదరుడి కొడుకు అరెస్టు