స్కైరూట్ వ్యవస్థాపకులతో ప్రధాని మోదీ భేటీ.. భారత భవిష్యత్ అంతరిక్ష ప్రణాళికలపై చర్చ
ABN , Publish Date - Jul 28 , 2026 | 11:27 AM
భారత ప్రైవేట్ అంతరిక్ష రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. భారత భవిష్యత్ అంతరిక్ష ప్రణాళికలపై చర్చించారు.
ఢిల్లీ, జులై 28: భారత ప్రైవేట్ అంతరిక్ష రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన స్కైరూట్ ఏరోస్పేస్ (Skyroot Aerospace) వ్యవస్థాపకులు ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన ఆర్బిటల్-క్లాస్ రాకెట్ 'విక్రమ్-1' (Vikram-1) ను విజయవంతంగా ప్రయోగించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు పవన్ చందన, నాగ భరత్ డాకాలతో జరిగిన భేటీ అనంతరం ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X' ద్వారా తన సంతోషాన్ని పంచుకున్నారు. 'పవన్ చందన, నాగ భరత్ డాకాలతో అద్భుతమైన సంభాషణ జరిగింది' అని ప్రధాని పేర్కొన్నారు. ఈ చర్చలో విక్రమ్-1 రాకెట్ సాధించిన విజయం సహజంగానే ప్రధానాంశంగా నిలిచింది. దీంతో పాటు అంతరిక్ష రంగానికి సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు కూడా చర్చకు వచ్చాయి.
'స్కైరూట్ ఇప్పటివరకు సాగించిన ప్రయాణం, భవిష్యత్తు ప్రణాళికల గురించి వారి మాటల్లో వినడం సంతోషాన్ని ఇచ్చింది. వారి శక్తి, ఆశయం, సానుకూలత దేశంలోని వైబ్రేంట్ ప్రైవేట్ అంతరిక్ష పర్యావరణ వ్యవస్థ స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నాయి. మొత్తం స్కైరూట్ బృందానికి నా శుభాకాంక్షలు' అని ప్రధాని మోదీ ప్రశంసించారు.
ప్రధాని మోదీతో భేటీ కావడం తమకు దక్కిన గౌరవంగా స్కైరూట్ ఏరోస్పేస్ పేర్కొంది. తమ కంపెనీ ప్రయాణం, విజయవంతమైన విక్రమ్-1 మిషన్, అంతరిక్ష రంగ భవిష్యత్తుపై తమకున్న విజన్‌ను ప్రధానమంత్రితో పంచుకున్నామని వ్యవస్థాపకులు తెలిపారు.
ఈ సమావేశంలో ప్రధాని మోదీ సాంకేతికత, దీర్ఘకాలిక దార్శనికత, భారత ప్రైవేట్ అంతరిక్ష రంగానికి ముందున్న అవకాశాల గురించి చర్చించారని కంపెనీ తెలిపింది. 'యువ పారిశ్రామికవేత్తలకు ప్రధాని ఇస్తున్న ప్రోత్సాహం, భారతదేశంలో పెరుగుతున్న ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థపై ఆయనకున్న విశ్వాసం మమ్మల్ని నిరంతరం ప్రేరేపిస్తూనే ఉంటాయి' అని స్కైరూట్ బృందం పేర్కొంది.
ఇవి కూడా చదవండి...
కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం.. అజయ్ ప్రతిభకు నిదర్శనం: మంత్రి
కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం.. తిరుమల విద్యాసంస్థల డైరెక్టర్ మృతి
Read Latest AP News And Telugu News