Share News

PM Modi: సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్‌లో మోదీ... సాదర స్వాగతం

ABN , Publish Date - Jan 10 , 2026 | 08:18 PM

సోమనాథ్ ఆలయంపై 1026లో తుర్కియే పాలకుడు గజనీ మహ్మద్ దాడి చేసి విధ్వంసం చేశాడు. పలువురు విదేశీ పాలకులు కూడా ఆలయంపై దాడి చేసి దోచుకున్నారు. అప్పట్నించి ఆలయ పునరుద్ధరణ పనులతో సోమనాథ్ ఆలయం తన వైభవాన్ని చాటుకుంటూనే ఉంది.

PM Modi:  సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్‌లో మోదీ... సాదర స్వాగతం
PM Modi

అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) గుజరాత్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా రాజ్‌కోట్‌లోని హీరసర్ విమానాశ్రయానికి శనివారంనాడు చేరుకున్నారు. రాష్ట్ర మంత్రి కుంవర్జీ బావలియా, రాజ్‌కోట్ మేయర్ తదితరులు ప్రధాని సాదర స్వాగతం పలికారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో సోమనాథ్‌కు ప్రధాని బయలుదేరారు. ప్రధాని తన పర్యటనలో ప్రఖ్యాత సోమనాథ్ ఆలయాన్ని దర్శంచి ప్రత్యేక పూజల్లో పాల్గోనున్నారు. అనంతరం 'సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్' సెలబ్రేషన్స్‌లో పాల్గొంటారు.


సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్

సోమనాథ్ ఆలయంపై 1026లో గజనీ మహ్మద్ దాడి చేసి విధ్వంసం చేశాడు. పలువురు విదేశీ పాలకులు కూడా ఆలయంపై దాడి చేసి దోచుకున్నారు. అప్పట్నించి ఆలయ పునరుద్ధరణ పనులతో సోమనాథ్ ఆలయం తన వైభవాన్ని చాటుకుంటూనే ఉంది. అయితే మొదటిసారి జరిగిన దురాగతానికి వెయ్యేళ్లు పూర్తి అవుతున్న సందర్భాన్ని పురస్కరించి సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ పేరుతో ఏడాదంతా వివిధ కార్యక్రమాలను తలపెట్టారు. ఈనెల 8 నుంచి 11 వరకూ వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా వేలాది మంది సాధువులు ఈ ఉత్సవాల్లో పాల్గొని ఆలయ ఆవరణలో జరిగే 72 గంటల ఓంకార (Om) ఉచ్ఛరణ కార్యక్రమంలో పాల్గోనున్నారు. సాయంత్రం ఉత్సవాల్లో భాగంగా డ్రోన్ షో, మంత్ర పఠనం ప్రత్యేక ఆకర్షణలు కానున్నారు.


ఆలయ పునరుద్ధరణకు 75 ఏళ్లు

సర్దార్ పటేల్ సారథ్యంలో 1951లో ఆలయ పునర్మిర్మాణం జరిగి భక్తుల సందర్శన కోసం తలుపులు తెరుచుకున్నారు. 2026లో 75వ వసంతానికి చేరుకోవడంతో సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. 'భారతీయ నాగరికత అజేయ సంకల్పం, బలానికి గొప్ప నిదర్శనం సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణం. మన ఆధ్యాత్మిక సంప్రదాయానికి శక్తివంతమైన చిహ్నం. సంపూర్ణ విశ్వాసం, ఉత్సుకత, భక్తితో యావద్దేశం స్వాభిమాన్ పర్వ్ ఉత్సవాలను జరుపుకొంటోంది' అని మోదీ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొన్నారు.


శౌర్య యాత్ర

సోమనాథ్ ఉత్సవాల్లో భాగంగా జనవరి 11వ తేదీ ఉదయం 9.45 గంటలకు జరిగే శౌర్యయాత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గోనున్నారు. సోమనాథ్ ఆలయాన్ని శతాబ్దాలుగా కాపాడుకుంటున్న యోధుల సంస్మరణగా ఈ శౌర్యయాత్ర నిర్వహిస్తున్నారు. ధైర్యం, త్యాగం, శౌర్యానికి ప్రతీకలుగా 108 అశ్వాలు ఈ యాత్రలో పాల్గొంటాయి. సాయంత్రం జరిగే ఓంకార మంత్రోచ్ఛరణ కార్యక్రమంలోనూ ప్రధాని పాల్గొంటారు. ఆలయ చరిత్ర, భారతదేశ సమున్నత ఆధ్యాత్మిక విలువలపై జరిగే పబ్లిక్ ప్రోగ్రాంలో ఆయన ప్రసంగిస్తారు.


ఇవి కూడా చదవండి..

అయోధ్యలో భద్రతా వైఫల్యం.. కశ్మీర్ యువకుడి నిర్బంధం..

చరిత్రపై దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలి.. అజిత్ డోభాల్ కీలక వ్యాఖ్యలు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 10 , 2026 | 08:40 PM