దేశాన్ని అమ్మేశారు.. అమెరికాతో డ్రేల్ డీల్‌పై రాహుల్ గాంధీ
ABN , Publish Date - Feb 11 , 2026 | 03:09 PM
అమెరికాతో వాణిజ్య ఒప్పందం, కేంద్ర బడ్జెట్‌పై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికాతో ట్రేడ్ డీల్‌తో 140 కోట్ల ప్రజానీకం భవిష్యత్తును పణంగా పెట్టారని ఆరోపించారు.
న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందం, కేంద్ర బడ్జెట్‌పై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికాతో ట్రేడ్ డీల్‌తో 140 కోట్ల ప్రజానీకం భవిష్యత్తును పణంగా పెట్టారని ఆరోపించారు. ఇది సిగ్గు చేటని, దేశాన్ని అమ్మేశారని అన్నారు. 'మనం చమురు ఎక్కడ నుంచి కొంటామో అమెరికా నిర్ణయిస్తుందా? ఏ ప్రధానమంత్రి కూడా ఇలా చేయలేదు. ట్రేడ్ డీల్ పేరుతో మీరు పూర్తిగా లొంగిపోయారు' అని విరుచుకుపడ్డారు. లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌పై జరుగుతున్న చర్చల్లో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం చేశారు.
'అమెరికాతో డ్రీల్ డీల్‌లో ఎలాంటి లాజిక్ లేదు. భారత్ ఎలాంటి దామాషా ప్రయోజనాలు పొందకుండానే సాగిలపడింది. ఇరాన్ నుంచో, రష్యా నుంచో, మరో చోట నుంచో చమురు కొనుగోలు చేయాలని అమెరికా ఎలా నిర్ణయిస్తుంది? మీరు భరతమాతను అమ్మేశారు. మీరు సిగ్గుపడాలి. అమెరికా ఒత్తిడితో మోదీ వణికిపోయారు. దేశాన్ని అమ్మేశారు' అని రాహుల్ విమర్శించారు.
'ప్రధానమంత్రి కళ్లలో భయం కనిపిస్తోంది. అమెరికా దిగుమతులు 46 బిలియన్ డాలర్ల నుంచి 146 బిలియన్ డాలర్లకు పెరుగుతాయి. మనకు మాత్రం ఎలాంటి కమిట్‌మెంట్ ఇవ్వలేదు. మనం మాత్రం వారికి కమిట్‌మెంట్ ఇచ్చాం. మనం ఫూల్స్‌లా నిలబడ్డాం' అని రాహుల్ తప్పుపట్టారు. మార్షల్ ఆర్ట్స్‌లో వ్యక్తులు పట్టుకోల్పోయి, సరెండర్ అయినట్టే, రాజకీయాల్లో కూడా కొందరు సరెండర్ అవుతుంటారని అన్నారు. 'బ్రదర్ కూడా మొహమాటం పడటం లేదు. పార్లమెంటుకు మోదీ ముఖం చాటేయడం ఎలాంటి ఆశ్చర్యం కలిగించడం లేదు' అని వ్యాఖ్యానించారు.
ఎకనామిక్ సర్వేను రాహుల్ ప్రస్తావిస్తూ, తాను రెండు అత్యంత లోతైనా అంశాలను సభకు తెలియజేస్తున్నానని అన్నారు. మొదటిది ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికా ఆధిపత్యాన్ని చైనా, రష్యా వంటి శక్తులు సవాలు చేస్తున్నాయి. రెండవది ఇంధనం, ఆర్థిక వ్యవస్థలను ఆయుధాలుగా మలుచుకుంటున్న తీరు. ఈ పరిణామాలు ప్రపంచాన్ని ఎన్నడూ లేని విధంగా అంచనాలకు అందని స్థితికి నెట్టేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిరంతర ఘర్షణలే నేటి ప్రపంచ వాస్తవం అన్నారు. అమెరికా డాలర్ ఆధిపత్యం తగ్గుతోందని, డాలర్ సవాళ్లను అర్ధం చేసుకోవాలని సూచించారు. ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం వంటి అంతర్గత సమస్యలు, ప్రపంచ అస్థిరతను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ రూపకల్పన ఉండాలన్నారు.
ఇవి కూడా చదవండి..
మన డేటా రక్షణకు చర్యలేవీ.. కేంద్రంపై రాహుల్ ప్రశ్నల వర్షం
లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం.. మార్చి 9వ తేదీన చర్చ..