Share News

‘పిల్లల అదృశ్యం’పై సుప్రీం సీరియస్‌

ABN , Publish Date - Feb 11 , 2026 | 02:01 AM

దేశవ్యాప్తంగా నమోదవుతున్న పిల్లల అదృశ్యం ఘటనల వెనుక జాతీయస్థాయి నెట్‌వర్క్‌ ఏదైనా పని చేస్తున్నదేమోననే అనుమానాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది.

‘పిల్లల అదృశ్యం’పై సుప్రీం సీరియస్‌

  • దీని వెనుక జాతీయ నెట్‌వర్క్‌ ఏదైనా పని చేస్తోందా?

  • ఒకే పద్ధతిలో సాగుతున్నాయా, వేర్వేరు ఘటనలా?

  • రాష్ట్రాల నుంచి గణాంకాలను తెప్పించుకోండి

  • కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: దేశవ్యాప్తంగా నమోదవుతున్న పిల్లల అదృశ్యం ఘటనల వెనుక జాతీయస్థాయి నెట్‌వర్క్‌ ఏదైనా పని చేస్తున్నదేమోననే అనుమానాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని నిర్ధారించుకోవాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. ఒకే పద్ధతిలో ఇవన్నీ జరుగుతున్నాయా లేక వేర్వేరు ఘటనలా అనేది పరిశీలించాలని సూచించింది. దీనికి సంబంధించి రాష్ట్రాల వద్ద ఉన్న గణాంకాలను తెప్పించుకుని పరిశీలించాలని కోరింది. ‘గురియా స్వయమ్‌ సేవీ సంస్థ’ అనే ఎన్జీవో సంస్థ దాఖలుచేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణను మంగళవారం జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం కొనసాగించింది. కేంద్రం తరఫున అడిషినల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాతీ వాదనలు వినిపించారు. పిల్లల అదృశ్యం, దానిపై నమోదైన కేసుల వివరాలను కొన్ని రాష్ట్రాలు తమతో పంచుకుంటుండగా, ఎక్కువ రాష్ట్రాలు మాత్రం సహకరించడం లేదన్నారు. పూర్తి గణాంకాలు చేతిలో లేకుండా ఏ విషయమూ నిర్ధారించలేమని తెలిపారు. దీనిపై బెంచ్‌ జోక్యం చేసుకుంటూ.. ఈ ఘటనల వెనుక జాతీయ నెట్‌వర్క్‌ లేక రాష్ట్రాల పరిధిలో ఏదైనా ప్రత్యేక గ్రూపు ఉన్నదా అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నామని స్పష్టం చేసింది. అదృశ్యం చెర నుంచి బయటపడిన పిల్లలను ఆరాతీసి కొన్ని వివరాలు తెలుసుకోవచ్చునని సూచించింది. ఈ విషయంలో కేంద్రానికి సహకరించని రాష్ట్రాలను ఉపేక్షించబోమని, అవసరమైతే కఠిన ఆదేశాలు జారీ చేస్తామని బెంచ్‌ హెచ్చరించింది. సీనియర్‌ న్యాయవాది అపర్ణ భట్‌ స్పందిస్తూ.. దీనిపై ఇప్పటికే రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసిందని, స్పష్టమైన నిర్దేశాలను జారీచేసిందని తెలిపారు. కాగా, గత ఏడాది డిసెంబరు 9న జరిగిన విచారణ సందర్భంగా, కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా పిల్లల అదృశ్యాలకు సంబంధించిన ఆరేళ్ల గణాంకాలను తనకు అందించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది.

Updated Date - Feb 11 , 2026 | 02:01 AM