భద్రతా బలగాలతో దీపావళి జరుపుకున్న ప్రధాని మోదీ
ABN , Publish Date - Nov 08 , 2026 | 01:31 PM
నక్సలిజంపై దశాబ్దాలుగా కొనసాగిన పోరాటంలో కీలక మైలురాయి సాధించామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని ప్రతి జిల్లా నక్సలిజం ప్రభావం నుంచి విముక్తి పొందిన నేపథ్యంలో ఈ ఏడాది దీపావళి ప్రత్యేకమైనదని పేర్కొన్నారు.
బస్తర్, నవంబర్ 11: నక్సలిజంపై దశాబ్దాలుగా కొనసాగిన పోరాటంలో కీలక మైలురాయి సాధించామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని ప్రతి జిల్లా నక్సలిజం ప్రభావం నుంచి విముక్తి పొందిన నేపథ్యంలో ఈ ఏడాది దీపావళి ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. కోట్లాది మంది ప్రజలు నక్సలిజం భయం లేకుండా పండుగ జరుపుకుంటున్నారని వెల్లడించారు. ఆదివారం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా కరణ్‌పూర్‌లో ఉన్న కోబ్రా (CoBRA) ఆపరేషన్స్ బేస్‌ను ప్రధాని సందర్శించారు. అక్కడ భద్రతా బలగాలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. నక్సలిజంపై పోరాటంలో సైనికులు, భద్రతా సిబ్బంది చేసిన త్యాగాలను ఆయన కొనియాడారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఒకప్పుడు మావోయిస్టుల కేంద్రంగా ఉన్న బస్తర్, అబుజ్‌మఢ్ ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయని అన్నారు. భద్రతా బలగాల ధైర్యం, అంకితభావం, త్యాగాల కారణంగా నక్సలిజం ముప్పు తగ్గి అభివృద్ధికి మార్గం సుగమమైందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు తమ కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి జరుపుకుంటున్న వేళ తాను మాత్రం దేశ రక్షణలో ఉన్న జవాన్లతో ఈ పండుగను చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. సరిహద్దుల్లోనే కాకుండా దేశ అంతర్గత ప్రాంతాల్లోనూ ప్రజలకు రక్షణ కల్పిస్తున్న భద్రతా సిబ్బంది తన కుటుంబ సభ్యులతో సమానమని అన్నారు.
నక్సలిజం సమస్యపై దాదాపు 40 నుంచి 50 ఏళ్లుగా కొనసాగుతున్న పోరాటంలో దేశం కీలక విజయాన్ని సాధించిందని ప్రధాని పేర్కొన్నారు. ఈ గెలుపులో భద్రతా బలగాల పాత్ర ఎంతో కీలకమని, వారి సేవలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని తెలిపారు. నక్సలిజం ప్రభావం నుంచి బయటపడిన ప్రాంతాల్లో ప్రజలు భయంలేకుండా జీవిస్తూ అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారని మోదీ చెప్పుకొచ్చారు. ఈ పోరాటంలో ప్రాణాలు అర్పించిన భద్రతా సిబ్బందికి నివాళులర్పిస్తూ, వారి త్యాగాల ఫలితంగానే దేశంలో ప్రశాంత వాతావరణం నెలకొందని ప్రధాని మోదీ ప్రశంసించారు.
ఈ వార్తలు కూడా చదవండి
అయోధ్యపై దుష్టశక్తుల చూపు పడనివ్వం: యోగి ఆదిత్యనాథ్
'2029లో బీజేపీ ఓటమి ఖాయం'.. అభిజీత్ దీప్కే జోస్యం