బంగారం ఎందుకు కొనొద్దంటే..
ABN , Publish Date - May 12 , 2026 | 06:14 AM
‘‘ఏడాదిపాటు ఎవరూ బంగారం కొనొద్దు’’ ...భాగ్యనగరం పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ బంగారం గురించి చేసిన ఈ ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా..
మన విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడమే లక్ష్యం
ఏటా మన పసిడి దిగుమతులు 700-900 టన్నులు!
కిందటి ఏడాది ముడిచమురు, స్వర్ణం, వంట నూనెలు,
ఎరువుల దిగుమతికే ఏకంగా రూ.23 లక్షల కోట్ల వ్యయం
భారతదేశ మొత్తం దిగుమతుల బిల్లు రూ.74 లక్షల కోట్లు
ప్రస్తుతం మన వద్ద ఉన్నది 9-11 నెలలకు సరిపడా నిల్వలే
అవి వేగంగా కరిగిపోతే ఆర్థిక సంక్షోభంలోకి జారే ముప్పు
అందుకే దేశ ప్రజలకు పలు సూచనలు చేసిన ప్రధాని మోదీ
ఆన్‌లైన్ క్లాసులకు మారండి.. ఖర్చులు తగ్గించుకోండి
విదేశాలకు వెళ్లొద్దు.. ప్రజలకు ప్రధాని మరోసారి విజ్ఞప్తి
(సెంట్రల్ డెస్క్) : ‘‘ఏడాదిపాటు ఎవరూ బంగారం కొనొద్దు’’ ...భాగ్యనగరం పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ బంగారం గురించి చేసిన ఈ ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా.. గతంలో ఎన్ని సంక్షోభాలు, ఆర్థిక మాంద్యాలు వచ్చినా ఏ ప్రధానీ చేయని విధంగా.. మోదీ చేసిన ఈ సూచన సాధారణమైనది కాదని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బంగారం అనే మాట భారతీయులందరికీ వెంటనే కనెక్ట్ అయ్యే మాట కాబట్టి దాని గురించే అంతా మాట్లాడుకుంటున్నారుగానీ.. నిజానికి ప్రధాని మోదీ దాంతోపాటు ఇంకా చాలా జాగ్రత్తలే చెప్పారు. వాటన్నింటి సారం ఒక్కటే.. విదేశీ మారక ద్రవ్యాన్ని(ఫారెక్స్ రిజర్వులను) ఆదా చేయడం. ఎందుకు ఆదా చేయాలి? ఎప్పుడూ లేనంత కష్టం ఇప్పుడు ఏమొచ్చింది? అంటే.. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధరలు, ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. మరోవైపు.. 2-3 ఏళ్లుగా బంగారం ధర సైతం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. వీటి దిగుమతికే మన విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో అధిక శాతం ఖర్చయిపోయే పరిస్థితి నెలకొంది. ‘ట్రేడింగ్ ఎకనమిక్స్’ గణాంకాల ప్రకారం.. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టడానికి ముందు మన దేశ ఫారెక్స్ రిజర్వ్స్ 728 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంటే దాదాపు రూ.69.4 లక్షల కోట్లు. కేవలం రెండు నెలల్లో అవి 690.69 బిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను మన దిగుమతుల బిల్లు (ముడిచమురు, బంగారం, మందులు, ఆహారం, సెమీ కండక్టర్లు, ఎలకా్ట్రనిక్ ఉత్పత్తులు, ఇతర ఉత్పత్తులు, సేవలు అన్నీ కలిపి) 775 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.73.86 లక్షల కోట్లు). అందులో ముడిచమురు, బంగారం, వంట నూనెలు, ఎరువుల బిల్లే ఏకంగా 240 బిలియన్ డాలర్లకన్నా ఎక్కువ (దాదాపు రూ.22.87 లక్షల కోట్లు). ఇలా దిగుమతులకోసం మనం ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చే కొద్దీ మన ఫారెక్స్ నిల్వలు మరింత వేగంగా కరిగిపోతాయి. అలా కరిగిపోతే ఏమవుతుంది? అంటే.. దేశ ఆర్థిక బలం తగ్గిపోతుంది. డాలర్ విలువ పెరిగిపోయి రూపాయి విలువ తగ్గిపోతుంది. విదేశీ పెట్టుబడుల రాక ఆగిపోయి దేశం సంక్షోభంలోకి వెళ్లిపోతుంది.
ఎందుకంటే..
ఒక దేశ పరపతిని నిర్ణయించడంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ఒక దేశం ఎంత ధనికమైనది, ఎంత సురక్షితమైనది అని చెప్పడానికి ఈ ఫారెక్స్ రిజర్వులు ఒక రిపోర్ట్ కార్డులాంటివి. మూడీస్, ఎస్ అండ్ పి, ఫిచ్ వంటి అంతర్జాతీయ సంస్థలు.. ఫారెక్స్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్న దేశాలకు మంచి రేటింగ్ ఇస్తాయి. ఆ రేటింగ్ ఎంత ఎక్కువ ఉంటే అంత తక్కువ వడ్డీకి అప్పులు లభిస్తాయి. మనం బ్యాంకుల వద్దకు అప్పు కోసం వెళ్తే అవి మన సిబిల్ స్కోర్ ఎంత ఉందో చూసినట్టుగా.. ఒక దేశం విదేశాల నుంచి అప్పు తీసుకోవాలనుకుంటే.. ఆయా దేశాలు సదరు దేశం వద్ద విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఎంత ఉన్నాయనే విషయాన్నే(అంటే రేటింగ్స్‌నే) చూస్తాయి. ఒక దేశ ఫారెక్స్ రిజర్వులు తగ్గిపోతుంటే విదేశీ పెట్టుబడిదారులు ఆ దేశంలో తాము పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసేసుకుంటారు. సాధారణంగా 7-10 నెలలపాటు ముడిచమురు దిగుమతులకు సరిపడా విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉంటే ఆ దేశ పరపతి బాగున్నట్టు. 1991లో మన దేశం వద్ద కేవలం 2 వారాలకు సరిపడా మాత్రమే విదేశీ మారక ద్రవ్య నిల్వలున్నాయి. అందుకే మన బంగారాన్ని లండన్‌కి పంపి తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మన వద్ద విదేశీ మారక ద్రవ్య నిల్వలు దాదాపు 9 నుంచి 11 నెలలకు సరిపడా ఉన్నప్పటికీ.. పరిస్థితులు మన చేతుల్లో లేవు. పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పట్లో ముగిసేలాగా కనిపించట్లేదు. ముడిచమురు ధరల భారంతోపాటు..ఎరువుల ధరలు కూడా భారీగా పెరిగిపోయే ప్రమాదం కనపడుతోంది. అంటే వాటి దిగుమతుల కోసం చేయాల్సిన ఖర్చు మరింతగా పెరిగిపోయి డాలర్ల రిజర్వు అనుకున్నదానికంటే వేగంగా కరిగిపోయే ముప్పుంది. దీనికితోడు.. మనకు వచ్చే విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో ఎక్కువ భాగం గల్ఫ్ దేశాల నుంచి వచ్చే రెమిటెన్స్‌లే(అక్కడున్న భారతీయులు మనదేశంలో ఉన్న తమ కుటుంబసభ్యులకు పంపే డబ్బు). యుద్ధం దెబ్బకు అతలాకుతలమైన గల్ఫ్ దేశాల్లో ఉంటున్న మనవాళ్లు పంపే డబ్బు తగ్గిపోతోంది. దీనికితోడు.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మన ఎగుమతులకు, తద్వారా మనకు రావాల్సిన డాలర్లకు కూడా ఆటంకం కలుగుతోంది. ఒకవైపు మనకు రావాల్సిన విదేశీ మారక ద్రవ్యంలో కోత పడుతుండగా, మరోవైపు మన వద్ద ఉన్న నిల్వలు కరిగిపోతున్నాయి.
బంగారంపైనే ఎందుకు దృష్టి..
ప్రధాని మోదీ తన ప్రసంగంలో బంగారం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడానికి కారణం ఏంటంటే.. భారతీయులు ఏడాదికి సగటున కొనే పసిడి దాదాపు 700-900 టన్నులని అంచనా! దీని విలువ సుమారు రూ.13.69 లక్షల కోట్లు. 2024-25తో పోలిస్తే.. 2025-26లో మన బంగారం దిగుమతులు దాదాపు 24ు పెరిగాయి. భారతీయులు కొనే బంగారంలో 90 శాతానికి పైగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదే. అందుకు మనం భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి వస్తోంది. కాబట్టి మోదీ చెప్పినట్లు ఏడాది పాటు బంగారం కొనకుండా ఉంటే కచ్చితంగా మన విదేశీ మారక ద్రవ్య నిల్వలపై భారం కాస్తంతైనా తగ్గుతుంది.
45 బిలియన్ డాలర్లు ఆదా చేయొచ్చు..
ప్రధాని పిలుపు మేరకు దేశ ప్రజలు ఇంధన వినియోగం, బంగారం కొనుగోళ్లు, వంట నూనెల వినియోగం 10 శాతం తగ్గించుకుని, ఎరువుల దిగుమతులను 50ు మేర తగ్గించి, అనవసర విదేశీ పర్యటనలను మానుకుంటే.. ఏడాదిలో 4500 కోట్ల డాలర్ల మేర విదేశీ మారక ద్రవ్య నిల్వలను ఆదా చేయొచ్చని ఒక అంచనా. అంటే మన కరెన్సీలో దాదాపుగా రూ.4.3 లక్షల కోట్లు.
ఇవి కూడా చదవండి..
మాజీ సీఎం స్టాలిన్‌ను కలిసిన విజయ్.. తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ..
సీఎం తప్పితే ఇంకేమీ వద్దు... పట్టుబడుతున్న సతీశన్, రంగంలోకి రాహుల్