Share News

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి.. 22వ విడత నిధులు ఎప్పుడంటే?

ABN , Publish Date - Feb 20 , 2026 | 11:58 AM

PM Kisan Samman Nidhi 2026: రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అద్భుత పథకాల్లో పీఎం కిసాన్ స్కీమ్ ఒకటి. ఈ పథకం కింద అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఏడాదికి రూ.6,000 చొప్పున జమ చేస్తుంది కేంద్రం. ఇలా ఇప్పటివరకు 21 విడతల్లో ఈ నిధులు అందగా.. 22వ విడత కోసం లబ్ధిదారులు వేచిచూస్తున్నారు.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి.. 22వ విడత నిధులు ఎప్పుడంటే?
PM Kisan 2026

ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఏడాదికి రూ.6,000 చొప్పున జమ చేస్తోంది. ఒక్కో రైతు మూడు సమాన వాయిదాలలో సంవత్సర కాలంలో ఈ మొత్తాన్ని పొందుతారు. రైతుల జీవనోపాధిని బలోపేతం చేయడం సహా వ్యవసాయ వృద్ధిని ప్రోత్సహించేందుకు సకాలంలో ఆర్థిక సాయాన్ని అందించడంలో భాగంగా భారత ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. మరి ఈ సారి ఆ నిధులు ఎప్పుడు క్రెడిట్ అవుతాయి? ఎవరు ఈ పథకానికి అర్హులు? రైతులు ఏం చేయాలనే వివరాలను ఓసారి పరిశీలిస్తే...


రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అద్భుత పథకాల్లో పీఎం కిసాన్ స్కీమ్ ఒకటి. ఇక్కడ రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఏటా రూ.6 వేలు నేరుగా రైతుల అకౌంట్లో జమ చేస్తుంది. ఇలా ఇప్పటివరకు 21 విడతల్లో ఈ నిధులు అందగా.. 22వ విడత కోసం లబ్ధిదారులు వేచిచూస్తున్నారు. అంతకంటే ముందు రైతులు.. ఈ- కేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తిచేయాల్సి ఉంటుంది.


లబ్ధిదారులు కామన్ సర్వీస్ సెంటర్లలో బయోమెట్రిక్ ఆధారిత కేవైసీ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ పోర్టల్‌లోనూ ఆధార్ ఓటీపీ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చు. పీఎం కిసాన్ యాప్‌లో ముఖ గుర్తింపు ద్వారా కూడా కేవైసీ పూర్తిచేయవచ్చు. సంబంధిత స్టేటస్ తెలుసుకునేందుకు.. పీఎం కిసాన్ అధికారిక పోర్టల్‌ను సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ ఫార్మర్స్ కార్నర్‌లో కనిపించే Know your statusపై క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చాను ఎంటర్ చేస్తే.. ఓటీపీ వస్తుంది. ఓటీపీని నమోదు చేయడం ద్వారా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా అక్కడ రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, మండలం, గ్రామం పేర్లను ఎంటర్ చేసి.. గెట్ రిపోర్ట్‌పై క్లిక్ చేయడం ద్వారా లబ్ధిదారుల జాబితాను పొందవచ్చు.


రైతులకు పంట పెట్టుబడి సాయం కింద నగదును అందించే ఈ స్కీమ్‌ను 2019లో ప్రారంభించారు. నాటి నుంచి ఏటా రూ.6 వేల నగదును రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా.. 3 సమాన విడతల్లో 4 నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున జమచేస్తోంది. ఈ నగదు మొత్తం నేరుగా లబ్ధిదారుల ఖాతాలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్(డీబీటీ) విధానంలో జమవుతుంది. 21వ విడత నిధులు గతేడాది నవంబర్ 19న విడుదలయ్యాయి. తమిళనాడులోని కోయంబత్తూర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నగదును నేరుగా రైతుల అకౌంట్లలో జమచేశారు. దీంతో 9.35 కోట్ల మందికిపైగా రైతుల ఖాతాల్లో సుమారు రూ.18 వేల కోట్లకుపైగా నిధులు జమయ్యాయి. ఈ నగదు జమ అయి దాదాపు 3 నెలలైన తరుణంలో 22వ విడత నిధుల కోసం ఎదురుచూస్తున్నారు అన్నదాతలు. గత చరిత్ర ఆధారంగా ఫిబ్రవరిలోనే ఈ నిధులు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అంటే 19వ విడత నిధులు ఫిబ్రవరి 24న విడుదలయ్యాయి. అంతకముందు 2024లో 16వ విడత కింద ఫిబ్రవరి 28న విడుదలయ్యాయి. 2023లోనూ ఫిబ్రవరి 27న విడుదల చేసింది కేంద్రం. దీంతో ఈసారి కూడా 22వ విడత సొమ్ము ఈ నెలలోనే జమయ్యే అవకాశముంది.


ఇవీ చదవండి:

మళ్లీ పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్స్!

ఇంకా నగదే రారాజు

Updated Date - Feb 20 , 2026 | 12:46 PM