ఇంకా నగదే రారాజు
ABN , Publish Date - Feb 17 , 2026 | 05:38 AM
డిజిటల్ చెల్లింపులు ఎంతగా పెరిగినా దేశంలో ఇప్పటికీ నగదుదే హవా. ఎన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నా ప్రజలు ఇప్పటికీ నగదునే ఎక్కువగా నమ్ముకుంటున్నారు. దీంతో చలామణి లో ఉన్న నగదు...
ఎస్‌బీఐ రీసెర్చ్
దేశంలో రికార్డు స్థాయికి నగదు చలామణి
జనవరి నాటికి రూ.40 లక్షల కోట్లు
యూపీఐ చెల్లింపులదీ అదే హవా
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులు ఎంతగా పెరిగినా దేశంలో ఇప్పటికీ నగదుదే హవా. ఎన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నా ప్రజలు ఇప్పటికీ నగదునే ఎక్కువగా నమ్ముకుంటున్నారు. దీంతో చలామణి లో ఉన్న నగదు (సీఐసీ) జనవరి నెలలో రికార్డు స్థాయిలో రూ.40 లక్షల కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 11.1 శాతం ఎక్కువని ఎస్‌బీఐ రీసెర్చ్ సోమవారం విడుదల చేసిన ఒక నివేదికలో తెలిపింది. 2024 జనవరితో పోలిస్తే 2025 జనవరిలో నమోదైన వృద్ధి రేటు 5.3 శాతం మాత్రమే. ఇంక్రిమెంటల్ ప్రాతిపదికన చూస్తే సీఐసీ రూ.88,517 కోట్ల నుంచి రూ.2.76 లక్షల కోట్లకు పెరిగినట్లు పేర్కొంది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఇది దాదాపు 3.11 రెట్లు ఎక్కువ.
97.6 శాతం ప్రజల వద్దే: దేశంలో చలామణిలో ఉన్న నగదులో సింహభాగం బ్యాంకుల వద్ద లేదు. నోట్ల కట్టల రూపంలో ప్రజల వద్దే మూలుగుతోంది. ఈ ఏడాది జనవరి నాటికి చలామణిలో ఉన్న నగదులో 97.6 శాతం (రూ.39 లక్షల కోట్లు) ప్రజల వద్దే ఉన్నట్టు ఎస్‌బీఐ రీసెర్చ్ పేర్కొంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 11.1 శాతం ఎక్కువ. ఈ వృద్ధి రేటు ఇలానే కొనసాగితే మార్చితో ముగిసే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రజల వద్ద ఉన్న నగదు వృద్ధి రేటు కొవిడ్‌కు ముందు స్థాయిని మించిపోతుందని అంచనా. అప్పట్లో దాదాపు రూ.4.6 లక్షల కోట్ల అదనపు నగదు ప్రజల వద్ద చేరింది.
జీడీపీపరంగా చూస్తే: చలామణిలో ఉన్న నగదు మొత్తం పెరిగిపోతున్నా జీడీపీపరంగా చూస్తే మాత్రం తగ్గుతోంది. 2021 మార్చి నాటికి చలామణిలో ఉన్న నగదు శాతం జీడీపీలో 14.4 శాతం వరకు ఉండేది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇది 11 శాతానికి దిగివస్తుందని తెలిపింది. జీడీపీపరంగా చూస్తే ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేసే నగదు శాతమూ తగ్గుతోంది. ఆర్థిక వ్యవస్థలో నగదు వాడకం తగ్గుముఖం పడుతోందనేందుకు ఇది స్పష్టమైన సంకేతమని ఎస్‌బీఐ రీసెర్చ్ పేర్కొంది.
డిజిటల్ చెల్లింపుల జోరు: దేశంలో నగదు చలామణితో పాటు డిజిటల్ చెల్లింపులు శరవేగంగా పెరుగుతున్నాయి. గత నెల (జనవరి) రికార్డు స్థాయిలో రూ.28.3 లక్షల కోట్ల యూపీఐ చెల్లింపులు నమోదయ్యాయని ఎస్‌బీఐ నివేదిక తెలిపింది. అప్పటికి దేశంలో చలామణిలో ఉన్న మొత్తం నగదులో ఇది దాదాపు 70 శాతానికి సమానం. దీంతో దేశంలో డిజిటల్ చెల్లింపులు, చలామణిలో ఉన్న నగదు ఒకదానితో ఒకటి పోటీపడుతున్నట్టయింది. జీడీపీలో చోటు చేసుకుంటున్న అదనపు వృద్ధి రేటుకు ఇప్పుడు డిజిటల్ చెల్లింపులు ప్రధాన ఇంధనంగా మారాయి. డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలూ ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఈ ప్రోత్సాహకాలను నిలిపివేస్తే డిజిటల్ చెల్లింపుల వృద్ధి రేటుకూ బ్రేక్ పడుతుందని ఎస్‌బీఐ
రీసెర్చ్ హెచ్చరించింది.నగదు చలామణి ఎందుకంటే?
వివిధ రాష్ట్రాల్లో నెలకు రూ.40 లక్షల కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలు జరిపిన చిరు వ్యాపారులకు అందుతున్న జీఎ్‌సటీ డిమాండ్ నోటీసులు
ఈ నోటీసులతో భయపడిన చిరు వ్యాపారులు నగదు చెల్లింపులపై ఒత్తిడి చేయడం
బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గడంతో నగదు దగ్గర పెట్టుకునేందుకు ప్రజలు ముఖ్యంగా గ్రామీణ మొగ్గు చూపడం
పన్నుల కోతతో పట్టణ ప్రజల్లో వినియోగ ఖర్చులు పెరగడం
ఆర్‌బీఐ ఆదేశాలతో బ్యాంకులు ఏటీఎంల్లో రూ.100, రూ.200 నోట్ల నిల్వలు పెంచడం
వ్యక్తిగత చెల్లింపుల్లో 86 శాతం చెల్లింపుల మొత్తం రూ.500 మించకపోవడం
ఇవి కూడా చదవండి..
దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..