ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారంటూ.. సీఈసీపై సుప్రీంకోర్టులో పిల్
ABN , Publish Date - Sep 25 , 2026 | 03:31 PM
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. కీలక నిర్ణయాలను సీఈసీ ఏకపక్షంగా తీసుకున్నారని ఆరోపిస్తూ మీడియాలో వచ్చిన రిపోర్టుల ఆధారంగా శైలేంద్రమణి త్రిపాఠి అనే అడ్వొకేట్ ఈ పిల్ వేశారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. కీలక నిర్ణయాలను సీఈసీ ఏకపక్షంగా తీసుకున్నారని ఆరోపిస్తూ మీడియాలో వచ్చిన రిపోర్టుల ఆధారంగా శైలేంద్రమణి త్రిపాఠి అనే అడ్వొకేట్ ఈ పిల్ వేశారు. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బిర్ సింగ్ సంధూ, వివేక్ జోషిని సంప్రదించకుండా సీఈసీ జ్ఞానేశ్ కుమార్ నిర్ణయాలు తీసుకున్నారని, అలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని త్రిపాఠి పేర్కొన్నారు.
సీఈసీ తీసుకున్న నిర్ణయాలన్నీ తప్పుల తడక అని ఆరోపించారు. ఆయన తీసుకున్న నిర్ణయాలన్నింటినీ చట్టవ్యతిరేకంగా ప్రకటించాలని, అలాగే ఫాం6ను తిరిగి తీసుకురావాలని ఆయన కోరారు. ఇక ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) సమయంలో ఓటరు జాబితాల నుంచి 13 కోట్ల మంది ఓటర్లను తొలగించారని, ఆ వ్యవహారంపైనా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో వైఫల్యం, నిర్లక్ష్యానికిగాను ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద సీఈఓ జ్ఞానేశ్ కుమార్, సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ మనీష్ గార్గ్, డైరెక్టర్ జనరల్ (ఐటీ) సీమా ఖన్నాను ప్రాసిక్యూట్ చేయాలని కోరారు.
ఆంగ్ల పత్రిక కథనం తర్వాత పిల్
ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బిర్ సింగ్ సంధూ, వివేక్ జోషి అభ్యంతరాలు వ్యక్తం చేసినా సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పట్టించుకోలేదంటూ ఓ ఆంగ్ల ప్రతిక ఇటీవలే కథనం వెలువరించిన సంగతి తెలిసిందే. ఆ పత్రిక కథనం తర్వాత అడ్వొకేట్ శైలేంద్రమణి త్రిపాఠి పిల్.. సుప్రీంకోర్టులో పిల్ వేశారు. ఇక సర్ ప్రక్రియతో పాటు ఫాం6కు మార్పులు చేయడం, ఓటర్ల జాబితా నిర్వహణకు సంబంధించి ఆ ఇద్దరు ఎన్నికల కమిషనర్లు 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. సీఈసీ పట్టించుకోలేదని ఆ కథనం పేర్కొంది. ఆ ఇద్దరు కమిషనర్లకు తెలియకుండానే సీఈసీ నిర్ణయాలు తీసుకున్నారని కథనం వెల్లడించింది.
ఇవీ చదవండి:
కేదార్‌నాథ్‌లో 5 నెలల్లోనే 50 టన్నుల చెత్త.. మూడేళ్ల కంటే ఇదే అధికం!
ఆసియా రికార్డు బద్దలు.. భారత్ ఖాతాలో రెండో స్వర్ణం