అవినీతి డీఎంకేను సాగనంపడానికి ప్రజలు నిర్ణయించుకున్నారు.. తిరుచ్చి ర్యాలీలో మోదీ
ABN , Publish Date - Mar 11 , 2026 | 09:45 PM
తమిళనాడులో కేంద్రం పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతోందని, ఇదే విషయం గతంలోనూ తాను చెప్పడం జరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అవినీతి డీఎంకే పాలనకు ఉద్వాసన పలకాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నట్టు చెప్పారు.
తిరుచిరాపల్లి: తమిళనాడులో కేంద్రం పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతోందని, ఇదే విషయం గతంలోనూ తాను చెప్పడం జరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. అవినీతి డీఎంకే పాలనకు ఉద్వాసన పలకాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నట్టు చెప్పారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో తిరుచిరాపల్లిలో బుధవారంనాడు జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు.
'గత పర్యాయం తిరుచ్చి వచ్చాను. అప్పుడు రూ.20,000 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించాను. కొద్దిరోజుల క్రితం మదురైలో పర్యటించాను. రూ.4,400 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టాం. ఈరోజు రూ.5,600 కోట్ల ప్రాజెక్టులకు సంబంధించిన ప్రోగ్రాం కోసం వచ్చాను. తమిళనాడు ఉజ్వల భవిష్యత్తు కోసం ఎన్నో పెట్టుబడులు పెడుతున్నాం. వీటిలో క్లీన్ ఎనర్జీ, మ్యాన్యుఫ్యాక్చరింగ్, హైవేలు, రైల్వేలు, గ్రామీణ రోడ్లు వంటి కీలక రంగాలు ఉన్నాయి. వీటి వల్ల వేలాది మంది యువతకు కొత్తగా ఉద్యోగాలు వస్తాయి' అని మోదీ తెలిపారు.
అవినీతి సొమ్మతో ఒకే కుటుంబానికి లబ్ధి
తమిళనాడులోని అధికార డీఎంకే ప్రభుత్వంపై మోదీ విమర్శలు గుప్పించారు. స్టాలిన్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందన్నారు. రాష్ట్ర ప్రజలకు ఉద్దేశించిన నిధులు దారిమళ్లిస్తున్నారని, ఒక కుటుంబానికి లబ్ధి చేకూర్చేందుకు ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగాలను డబ్బులకు అమ్ముకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. డీఎంకేను గద్దె దింపేందుకు రాష్ట్ర ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నారని అన్నారు.
మదురై విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా
మదురై విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందని, తద్వారా ఇప్పుడు యావత్ ప్రపంచం మదురై ముంగిట వాలుతుందని అన్నారు. రాష్ట్రంలోనే అతి పురాతన విమానాశ్రయాల్లో ఇది ఒకటని, దక్షిణ తమిళనాడుకు గేట్‌వే అని ప్రశంసించారు. మదురై విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించడం వల్ల ప్రపంచం మొత్తానికి మదురై గొప్పతనం తేలతెల్లమవుతుందని అన్నారు. కాగా, దీనికి ముందు, బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేరళలోని ఎర్నాకుళంలో జరిగిన ర్యాలీ, రోడ్‌షోలో ప్రధాని పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
సీఈసీ అభిశంసనకు నోటీసుపై 180 మంది ఎంపీల సంతకం
స్పీకర్ ఓంబిర్లాపై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం