Share News

విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచే యత్నం.. ఆపై అరెస్ట్

ABN , Publish Date - Aug 07 , 2026 | 02:43 PM

మలేషియా నుంచి కొచ్చికి వస్తున్న బాటిక్ ఎయిర్ విమానంలో కలకలం రేగింది. విమానం ల్యాండ్ అవ్వడానికి కొన్ని నిమిషాల ముందు ఓ ప్రయాణికుడు అత్యవసర ద్వారాన్ని తెరిచేందుకు యత్నించాడు.

విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచే యత్నం.. ఆపై అరెస్ట్
Passenger Tries To Open Emergency Exit Before Kochi Landing, Arrested

ఆంధ్రజ్యోతి, ఆగస్టు 7: కౌలాలంపూర్)(మలేషియా) నుంచి కొచ్చికి వస్తున్న బాటిక్ ఎయిర్(Batik Air) విమానంలో తీవ్ర కలకలం రేగింది. విమానం ల్యాండ్ అవ్వడానికి కొన్ని నిమిషాల ముందు ఓ ప్రయాణికుడు అత్యవసర ద్వారాన్ని(Emergency Exit) తెరిచేందుకు యత్నించాడు. బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.


కేరళలోని పాలక్కడ్ జిల్లా కూటనాడ్‌కు చెందిన జంషీర్ అతణిక్కల్(34) అనే వ్యక్తి ఎమర్జెన్సీ ఎగ్జిట్ పక్కన ఉన్న విండో సీటులో ప్రయాణిస్తున్నాడు. విమానం కొచ్చి ఎయిర్‌పోర్ట్‌‌లో ల్యాండ్ అవ్వడానికి సిద్ధమవుతున్న సమయంలో జంషీర్ హఠాత్తుగా లేచి ఎమర్జెన్సీ డోర్ అద్దాన్ని కొడుతూ తలుపు తెరిచేందుకు యత్నించాడు. ఇంతలో ఆపేందుకు ప్రయత్నించిన కేబిన్ సిబ్బందిని, తోటి ప్రయాణికులను అతడు తీవ్రంగా బెదిరించాడు.


ప్రయాణికులు, విమాన సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి అతడిని గట్టిగా పట్టుకుని బంధించారు. అనంతరం రాత్రి 11:30 గంటలకు విమానం కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది.


విమానం ల్యాండ్ అవగానే బాటిక్ ఎయిర్ సెక్యూరిటీ బృందం ఫిర్యాదు మేరకు సీఐఎస్‌ఎఫ్(CISF) బలగాలు అతడిని అదుపులోకి తీసుకుని, అనంతరం నెడుంబస్సేరి పోలీసులకు అప్పగించారు. విమానానికి నష్టం కలిగించేందుకు యత్నించడం, నేరపూరిత బెదిరింపులు, అధికారుల ఆదేశాలను ఉల్లంఘించడం వంటి అభియోగాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే.. ఉగ్రవాదం లేదా విమానయాన భద్రతకు తీవ్ర విఘాతం కలిగించే చట్టాల కింద ప్రస్తుతానికి కేసులు నమోదు చేయలేదు. అతడు ఎందుకలా చేశాడనే కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.


ఈ వార్తలనూ చదవండి:

థాయ్‌లాండ్ స్కూల్‌లో కాల్పులు.. నలుగురి మృతి.. 15 మందికి గాయాలు..

భారతీయులకు యూఎస్ స్టూడెంట్ వీసాల్లో 62 శాతం కోత

Updated Date - Aug 07 , 2026 | 03:02 PM