Share News

వంద రోజులుగా ప్రొరోగ్‌ కాని పార్లమెంటు

ABN , Publish Date - Nov 22 , 2026 | 08:08 AM

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గత వంద రోజులుగా ప్రొరోగ్‌ కాకుండా సరికొత్త రికార్డును నెలకొల్పాయి. వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభలను ఆగస్టు 13నే నిరవధికంగా వాయిదా వేశారు.

వంద రోజులుగా ప్రొరోగ్‌ కాని పార్లమెంటు
Parliament Not Prorogued For 100 Days

న్యూఢిల్లీ, నవంబరు 21: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గత వంద రోజులుగా ప్రొరోగ్‌ కాకుండా సరికొత్త రికార్డును నెలకొల్పాయి. వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభలను ఆగస్టు 13నే నిరవధికంగా వాయిదా వేశారు. అయినా ప్రొరోగ్‌ అయినట్టు(సమావేశాలు ముగిసినట్టు) రాష్ట్రపతి ఇంతవరకు ప్రకటించలేదు. 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందే లోక్‌సభ సీట్ల పెంపు, మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్‌ అమలుకు ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం కోసం ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించే విషయంలో సస్పెన్స్‌ కొనసాగుతోంది.


లోక్‌సభలో బిల్లు ఆమోదానికి 15 నుంచి 18 ఓట్ల ఆధిక్యం లభిస్తుందనే స్పష్టమైన ధీమాను ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు అవకాశాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. అయితే, శనివారం సాయంత్రం వరకు ప్రత్యేక సమావేశాల తేదీలను ప్రభుత్వం ప్రకటించలేదు. కాగా, సుదీర్ఘంగా 87 రోజుల పాటు పార్లమెంటు సమావేశాలు ప్రొరోగ్‌ కాకుండా 2008లో నెలకొన్న రికార్డును తాజాగా అధిగమించడం గమనార్హం. ప్రత్యేక సమావేశాల నిర్వహణపై కొనసాగుతున్న అనిశ్చితి.. డిసెంబరు మొదటి వారంలో మొదలవ్వాల్సిన పార్లమెంటు శీతాకాల సమావేశాలపైనా ఊహాగానాలకు కారణమవుతోంది.


ఉభయ సభలు నిరవధికంగా వాయిదాపడిన తర్వాత ప్రొరోగ్‌ చేయడానికి రాజ్యాంగంలో నిర్దిష్ట గడువు ఏమీ లేదు. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా లోక్‌సభ సీట్ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 నుంచి 850కి పెంచడం, అలాగే, 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేసేందుకు ఈ బిల్లులో ప్రభుత్వం ప్రతిపాదించింది. దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ప్రతి రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు 50 శాతం పెంచాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.


ఈ అంశంపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని ప్రధానమంత్రికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే నాలుగు లేఖలు రాసినా స్పందన లేదని జైరామ్‌ రమేశ్‌ ఆక్షేపించారు. ‘పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదాపడి నేటికి 100 రోజులైంది. ఇప్పటికీ ప్రొరోగ్‌ చేయలేదు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు 2/3వ వంతు మెజారిటీ సాధించేందుకు ప్రధాని, హోంమంత్రి ద్వయం పన్నాగాలు పన్నుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందలేకపోయింది. ఇప్పుడు కొత్తగా ఆ బిల్లులో ఏం మార్పులు చేశారో ఎవరికీ తెలియదు’ అని జైరామ్‌ రమేశ్‌ అన్నారు.

Updated Date - Nov 22 , 2026 | 08:08 AM