Share News

20 సార్లు తప్పించుకున్న పాక్ జైషే ఉగ్రవాది ఖేల్ ఖతం

ABN , Publish Date - Feb 22 , 2026 | 08:57 PM

ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో భద్రతా బలగాలు మరోసారి పైచేయి సాధించాయి. పాకిస్థాన్‌ బేస్డ్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన మోస్ట్ వాటెండ్ టెర్రరిస్ట్‌ సైఫుల్లా ను బలగాలు ఆదివారంనాడు విజయవంతంగా మట్టుబెట్టాయి.

20 సార్లు తప్పించుకున్న పాక్ జైషే ఉగ్రవాది ఖేల్ ఖతం
Jaish terrorist Saifullah

శ్రీనగర్: ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో భద్రతా బలగాలు మరోసారి పైచేయి సాధించాయి. జమ్మూకశ్మీర్‌లో పాకిస్థాన్‌ బేస్డ్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన మోస్ట్ వాటెండ్ టెర్రరిస్ట్‌ సైఫుల్లా (JeM Terrorist Saifullah)ను బలగాలు ఆదివారంనాడు విజయవంతంగా మట్టుబెట్టాయి. కిష్ట్వార్ జిల్లాలో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టగా, వీరిలో సైఫుల్లా కూడా ఉన్నాడు. రెండేళ్లుగా ఇదే ప్రాంతంలో అతను తిరుగుతూ 20 సార్లు తృటిలో తప్పించుకున్నాడు. ఎట్టకేలకు సైఫుల్లా ఖేల్ ఖతమైనట్టు అధికార వర్గాలు తెలిపాయి.


జమ్మూకశ్మీర్ పోలీసులు, ఇంటెలిజెన్స్ బ్యూరో వర్గాల విశ్వసనీయ సమాచారంతో ఆపరేషన్ ట్రాపి-ఐ కింద చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో ఉగ్రవాదులు హతమైనట్టు 'వైట్ నైట్ కార్ప్స్' ఒక ప్రకటనలో తెలిపింది. కిష్త్వార్ జిల్లా ఛాత్రూ ఏరియాలోని పసెర్‌కూట్‌ ప్రాంతంలో ఉదయం 10.30 గంటలకు ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఆర్మీ, పోలీస్, సీఆర్‌పీఎఫ్ బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. నిషేధిత జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన పాక్ టెర్రరిస్టులు ఈ ప్రాంతంలో ఉన్నట్టు సమాచారం అందింది. కొండపాదాల వద్ద నిర్మించిన మట్టి ఇంట్లో ఉగ్రవాదులు దాక్కున్నట్టు సమాచారం రావడంతో బలగాలు అక్కడకు చేరుకున్నాయి. ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు వైట్ నైట్ కార్స్ప్ ధ్రువీకరించింది. ఘటనా స్థలి నుంచి రెండు ఏకే-47 రైఫిళ్లను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఛాత్రూ అటవీ ప్రాంతంలో గత నెలలో ఆరుసార్లు ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక సైనికుడు, ఒక ఉగ్రవాది మృతిచెందారు.


ఇవి కూడా చదవండి..

దేశం పరువు తీయొద్దు.. కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విమర్శలు..

ఏఐ సమ్మిట్ ఓ కీలక మలుపు! మన్‌ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Updated Date - Feb 22 , 2026 | 09:26 PM