పహల్గాం ఉగ్రదాడికి పాకిస్థాన్‌లోనే స్కెచ్: ఎన్ఐఏ
ABN , Publish Date - May 21 , 2026 | 12:09 PM
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఉగ్రదాడికి సంబంధించి.. వ్యూహా రచన, పథకం అమలు అంతా పాకిస్థాన్ కేంద్రంగానే సాగిందనేందుకు బలమైన సాక్ష్యాలతో బహిర్గతం చేసింది.
న్యూఢిల్లీ, మే 21: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఉగ్రదాడికి సంబంధించి.. వ్యూహా రచన, పథకం అమలు అంతా పాకిస్థాన్ కేంద్రంగానే సాగిందనేందుకు బలమైన సాక్ష్యాలతో ఎన్ఐఏ బహిర్గతం చేసింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఈ దాడికి తామే బాధ్యులమంటూ లష్కరే తోయ్యిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ప్రకటించింది. ఈ దాడికి వ్యూహా రచన నుంచి టీఆర్ఎఫ్ చేసిన ఈ ప్రకటన వరకు అంతా పాకిస్థాన్‌లోనే జరిగిందని వివరించింది. అందుకు సంబంధించిన ఫోన్ కాల్స్, ఐపీ అడ్రాస్ తదితర అంశాలను ఈ ఛార్జిషీట్‌లో ఎన్ఐఏ పొందుపరిచింది.
ఈ ఉగ్రదాడికి పాల్పడిన తీవ్రవాదులు ఫైజల్ జాట్ అలియాస్ సులేమాన్ షా, హబీబ్ తాహిర్ అలియాస్ జిబ్రాన్, హమ్జా అప్ఘానీల ఐపీ అడ్రస్, ఫోన్ నెంబర్లతోపాటు ఇతర ఆధారాలన్నీ పాక్‌లోని ఈ దాడి వెనుక సూత్రధారులతో వీరికి సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది.
సైనిక బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ మహాదేవ్’లో ఈ ముగ్గురు తీవ్రవాదాలను కాల్చి చంపారు. వారి నుంచి మొబైళ్లు స్వాధీనం చేసుకున్నారు. అవి పాక్‌లోనే కొనుగోలు చేసినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఈ మొబైల్ ఫోన్లు.. లాహోర్, కరాచీలో కొనుగోలు చేసినట్లు గుర్తించింది.
2025, ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలోని బైసరన్ లోయలోకి ఉగ్రవాదులు ప్రవేశించి.. పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మొత్తం 25 మంది మరణించారు. ఈ కాల్పుల ఘటనకు తామే బాధ్యులమని లష్కరే తోయ్యిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ప్రకటించింది. అది కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో టీఆర్ఎఫ్ వెనక్కి తగ్గింది. ఈ టీఆర్ఎఫ్ ప్రకటనపై కూడా ఎన్ఐఏ విచారణ జరిపింది. ఇవి కూడా పాకిస్థాన్ నుంచే వచ్చాయని వివరించింది.
ఈ ఉగ్రదాడికి టీఆర్ఎఫ్‌కు చెందిన ఉగ్రవాది సైపుల్లా అలియాస్ సాదిజ్ జాట్ కీలక సూత్రధారి అని ఎన్ఐఏ స్పష్టం చేసింది. అతడి ఆదేశాల మేరకే తీవ్రవాదులు బైసరన్ లోయలో రెక్కి నిర్వహించారని తన ఛార్జిషీట్‌లో ఎన్ఐఏ వెల్లడించింది. ఈ దాడి జరిగిన రోజు.. ఆ తీవ్రవాదులతో సైపుల్లా నిరంతరం చర్చలు జరిపినట్లు గుర్తించామని ఎన్ఐఏ తెలిపింది.
అంతేకాకుండా ఈ దాడి తర్వాత ఎలా తప్పించుకోవాలనే అంశాన్ని కూడా వారికి సైపుల్లా వివరించినట్లు ఎన్ఐఏ తెలిపింది. అంశాలన్నీ ఎన్ఐఏ తన ఛార్జిషీట్‌లో పొందుపరిచింది. మరోవైపు ఈ పహల్గాం ఉగ్రదాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని పాక్ స్పష్టం చేసింది. భారత్ తమపై కావాలని ఆరోపణలు చేస్తుందంటూ ప్రపంచానికి పాక్ చాటే ప్రయత్నం చేసింది. కానీ అంత మందిని పొట్టనపెట్టుకున్న ఈ ఉగ్రదాడికి వెనుక పాకిస్థాన్ ప్రమేయం ఉందని ఎన్‌ఐఏ తన దర్యాప్తులో నిగ్గు తేల్చింది.
ఈ వార్తలు కూడా చదవండి..
నెదర్లాండ్స్ ప్రధానికి ప్రధాని మోదీ అరుదైన కానుక
కేంద్ర మంత్రివర్గ సమావేశం.. ప్రక్షాళనకు వేళయిందా?
For More National news And Telugu News