ప్రక్షాళనకు వేళయిందా?
ABN , Publish Date - May 21 , 2026 | 05:46 AM
ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. పైకి సాధారణ సమావేశం లాగే కనిపిస్తున్నా మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించనున్నారంటూ...
నేడు క్యాబినెట్ సహా స్వతంత్ర మంత్రులు, సహాయ మంత్రులతో ప్రధాని భేటీ
న్యూఢిల్లీ, మే 20 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. పైకి సాధారణ సమావేశం లాగే కనిపిస్తున్నా మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించనున్నారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. కొందరిని మంత్రివర్గం నుంచి తప్పిస్తారంటూ వార్తలు గుప్పుమంటున్న నేపథ్యంలో పాతికమందికి పైగా మంత్రులకు ఇదే చివరి మంత్రివర్గ సమావేశం కానుందనే మాట కూడా వినిపిస్తోంది. మోదీ ప్రభుత్వంలోని 30మంది క్యాబినెట్ మంత్రులు, 36మంది సహాయ మంత్రులు, స్వతంత్ర హోదా కలిగిన ఐదుగురు మంత్రులు.. ఇలా మొత్తంగా 72 మంది మంత్రులు మోదీ అధ్యక్షతన ఈ సమావేశంలో పాల్గొననున్నారు. మోదీ ప్రభుత్వంలోని మంత్రులంతా సమావేశం కానుండటం ఈ ఏడాది ఇదే తొలిసారి. మంత్రుల పనితీరు, ప్రవర్తన వంటివి ప్రాతిపదికగా తీసుకొని పెద్ద సంఖ్యలో మంత్రులను సాగనంపేందుకు ఏర్పాట్లు జరగుతున్నాయని సమాచారం. వివాదాలతో వార్తల్లో నిలిచిన మంత్రులకు ఊస్టింగ్ తప్పదని తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశం సందర్భంగా వివిధ మంత్రిత్వశాఖల పనితీరు, ఇటీవల కాలంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి ఫలితాలు, భవిష్యత్తు కార్యాచరణ వంటి అంశాలు చర్చకురానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్ర సంక్షేమ పథకాల అమలు తీరు, సాధించిన విజయాలపై సమీక్ష చేయనున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు, ఆ కారణంగా ఆర్థికంగా మనదేశమ్మీద పడిన ప్రభావంపై చర్చించనున్నారు. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధ ప్రభావం కారణంగా దేశంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల ప్రభావం ప్రజలపై అతి తక్కువగా పడేలా ఏమేం చేయొచ్చు? అన్న విషయమ్మీద మంత్రులు, విభాగాలకు మోదీ దిశానిర్దేశం చేయనునన్నట్లు తెలిసింది. ఈ మేరకు ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని అన్ని రంగాల్లో ప్రతిపాదిత సంస్కరణలపై సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. వివిధ మంత్రిత్వశాఖల పనితీరుకు సంబందించి మంత్రులు సమావేశం సందర్భంగా ప్రత్యేకంగా ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇటీవల.. బెంగాల్, ఒడిసా, పుదుచ్చేరిలో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలోనూ విశ్లేషకులు ఈ మంత్రివర్గ సమావేశానికి ప్రాధాన్యమిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జాలర్ల కుటుంబంతో ఆత్మీయంగా గడిపిన సీఎం చంద్రబాబు
కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ధ్వజం
స్విచ్‌లు నొక్కితే సీఎం కాలేరు.. జగన్‌పై షర్మిల సెటైర్లు