పాలన అనేది సినిమా కాదు, రీటేక్స్ ఉండవు: విజయ్ ఎంట్రీపై చిదంబరం
ABN , Publish Date - Apr 11 , 2026 | 07:55 PM
తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్ రాజకీయ ప్రవేశంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాలన అనేది సినిమా కాదని, ఇందులో రీటేక్స్ ఉండవని అన్నారు. శివగంగలో శనివారంనాడు జరిగిన ర్యాలీలో చిదంబరం ప్రచారం చేశారు.
శివగంగ: తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్ రాజకీయ ప్రవేశంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాలన అనేది సినిమా కాదని, ఇందులో రీటేక్స్ ఉండవని అన్నారు. శివగంగలో శనివారంనాడు జరిగిన ర్యాలీలో చిదంబరం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీవీకే పార్టీకి రాజకీయ అనుభవం లేదని అన్నారు. నాయకత్వం అంటే ప్రజలతో మాట్లాడాలని, మమేకం కావాలని అన్నారు.
'విజయ్ పార్టీ ఒకటి రాజకీయాల్లోకి వచ్చింది. వారికి రాజకీయ అనుభవం లేదు. ఈరోజు ఆయన (విజయ్) కారైకుడి వచ్చారు. ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఇదెలా కుదురుతుంది? రాజకీయాలంటేనే మాట్లాడటం? అవునా కాదా? రాజకీయాలంటేనే చర్చ. నేను నా అభిప్రాయాలు చెప్పినప్పుడు ఆయన తన అభిప్రాయాలు చెప్పగలిగితే అది సరైన డిబేట్ జరుగుతుంది. నేనైతే మాట్లాడకుండా ఉండలేను' అని చిదంబరం అన్నారు. తాను కేంద్ర హోం మంత్రిగా, ఆర్థిక మంత్రిగా పనిచేశాననీ, ప్రతిసారి ప్రజల దగ్గరకు వస్తుంటాయని, కారులో ఒంటరిగా ప్రయాణిస్తుంటానని, ప్రజలకు సంబంధించిన ఏ అంశాన్నైనా చర్చించేందుకు సిద్ధంగా ఉంటానని చెప్పారు.
పాలన అంటే...
'సినిమాలకు పూర్తి భిన్నం పాలన. ఏ విధానాల వల్ల ప్రజలకు లబ్ధి చేకూరుతుందో దానిని పాలనగా చెబుతాం. ప్రజాధనం ఎలా ఉపయోగించాలి, ప్రజలకు నిజమైన ప్రయోజనం ఎలా చేకూర్చాలి, అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందనేది పాలనకు సంబంధించినవి. పాలన అనేది అంత సులువు కాదు. నేను 20 ఏళ్ల పాటు పాలన సాగించిన అనుభవంతో చెబుతున్నాను. అదేమంత సులభం కాదు' అని చిదంబరం చెప్పారు. పాలనలో రీటేక్‌లు ఉండవని, సినిమాల్లో ఒక టేక్ బాగుండకపోతే మరో టేక్ చేయవచ్చని, ప్రభుత్వయంత్రాంగం అలా కాదని చెప్పారు. ఒకసారి నిర్ణయం అంటూ తీసుకుంటే దానికి రీటేక్‌లు ఉండవని, నిర్ణయం యథాతథంగా అమలుకావాల్సిన ఉంటుందని వివరించారు. కాగా, ఈ ఎన్నికల్లో డీఎంకే సారథ్యంలోని సెక్యులర్ ప్రొగ్రసివ్ కూటమిలో భాగంగా కాంగ్రెస్ పోటీ చేస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 23న జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
జననాయగన్ లీక్‌ను బీజేపీతో ముడిపెట్టొద్దు: అన్నామలై
200కు పైగా సీట్లు గెలుచుకుంటాం.. సీఎం స్టాలిన్