Share News

జననాయగన్ లీక్‌ను బీజేపీతో ముడిపెట్టొద్దు: అన్నామలై

ABN , Publish Date - Apr 11 , 2026 | 06:17 PM

జననాయగన్ సినిమా లీక్ కావడం చట్టవిరుద్ధమైన చర్య అని, ఈ చిత్రం పైరేటెడ్ వెర్షన్‌కు ప్రజలు దూరంగా ఉండాలని అన్నామలై విజ్ఞప్తి చేశారు.

జననాయగన్ లీక్‌ను బీజేపీతో ముడిపెట్టొద్దు:  అన్నామలై
Annamalai on Jananayagan Leak

కోయంబత్తూరు: సెన్సార్ బోర్డు సమస్యలతో విడుదలలో జాప్యమైన విజయ్ 'జననాయగన్' (Jana Nayagan) సినిమా ఇప్పుడు థియేటర్‌కు రాకుండానే ఇంటర్‌నెట్‌లో లీక్ కావడం హాట్‌టాపిక్ అయింది. దీనిపై దక్షిణాది పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించారు. దీనికి తాజాగా రాజకీయ రంగు కూడా పులుముకుంటోంది. ఈ చిత్రం ఆన్‌లైన్‌లో లీక్ కావడం వెనుక కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ పాత్ర ఉందంటూ టీవీకే ఆరోపణలు చేసింది. అయితే ఈ రోపణలను తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై వెంటనే ఖండించారు. ఇవి రాజకీయ దిగజారుడు ఆరోపణలుగా కొట్టివేశారు. 'జననాయగన్' సినిమా లీక్ కావడం చట్టవిరుద్ధమైన చర్య అని, ఈ చిత్రం పైరేటెడ్ వెర్షన్‌కు ప్రజలు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.


కోయంబత్తూరులో పార్టీ అభ్యర్థి తరఫు ప్రచారం సాగిస్తున్న అన్నామలై శనివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ, ఈ వివాదంలోకి బీజేపీని ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. సినిమాల విడుదల, లీక్ వ్యవహారాల్లో పార్టీకి ఎలా ప్రమేయం ఉంటుందని నిలదీశారు. వదంతులు వ్యాప్తి చేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీని ఇందులోకి లాగడం సరికాదని చెప్పారు.


టీవీకే ఆరోపణకు ఖండన

కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిగా ఉన్న మురుగన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ)పై తన పరపతిని ఉపయోగించి సినిమాను లీక్ చేయించారని ఈనెల 10న టీవీకే నేత ఆధవ్ అర్జున ఆరోపించారు. థియేటర్‌లో విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో సినిమా లీక్ అయ్యేందుకు ఆయన ఉదయనిధి స్టాలిన్ సహకారం తీసుకున్నారని అన్నారు. దీనిపై అన్నామలై స్పందిస్తూ, టీవీకే మద్దతుదారులు, నేతలు కొందరు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. సీబీఎఫ్‌సీని బీజేపీ కంట్రోల్ చేయదని, సినిమా ప్రొడక్షన్ విషయంలో కానీ, విడుదల విషయంలో కానీ బీజేపీ ప్రమేయం లేదని స్పష్టంచేశారు.


నేను కూడా విజయ్ అభిమానినే

విజయ్‌ అభిమానులలో తాను కూడా ఉన్నానని, అధికారికంగా సినిమా విడుదల కాగానే థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తానని అన్నామలై చెప్పారు. ఒక సినిమా వెనుక ఎంతోమంది కష్టం, ప్రొడక్షన్ కంపెనీల పెట్టుబడులు వంటివి ఎన్నో ఉంటాయని, ప్రజలు ఆన్‌లైన్‌లో లీక్ అయిన వీడియోలను చూడకుండా వాటికి దూరంగా ఉండాలని కోరారు.


ఇవి కూడా చదవండి..

‘జననాయగన్‌’ లీక్‌పై విశ్వనాయకుడి స్పందన..

జన నాయగన్: ఎడిటింగ్ దశ నుంచే లీక్..

Updated Date - Apr 11 , 2026 | 06:22 PM