Share News

200కు పైగా సీట్లు గెలుచుకుంటాం.. సీఎం స్టాలిన్

ABN , Publish Date - Apr 11 , 2026 | 05:08 PM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే సారథ్యంలోని సెక్యులర్ ప్రొగ్రసివ్ అలయెన్స్ 200కు పైగా సీట్లు గెలుచుకుంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. అన్నాడీఎంకే ఎలాంటి సిద్ధాంతాలు లేకుండా ఢిల్లీలోని బీజేపీకి మరబొమ్మలా మారిందని అన్నారు.

200కు పైగా సీట్లు గెలుచుకుంటాం.. సీఎం స్టాలిన్
MK Stalin

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే సారథ్యంలోని సెక్యులర్ ప్రొగ్రసివ్ అలయెన్స్ (SPA) 200కు పైగా సీట్లు గెలుచుకుంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) తెలిపారు. అన్నాడీఎంకే ఎలాంటి సిద్ధాంతాలు లేకుండా ఢిల్లీలోని బీజేపీకి మరబొమ్మలా మారిందని అన్నారు. తమ ఐదేళ్ల ద్రవిడియన్ తరహా పాలనలో లెక్కలేనన్ని సంక్షేమ పథకాలు అమలు చేశామని, కలైంజ్ఞర్ మహిళా సాధికారతా పథకం కింద నెలకు రూ.1000 ఆర్థిక సాయం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, పాఠశాల పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్, రెండు లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని చెప్పారు.


'ప్రజలకు మా పార్టీ పట్ల అపారమైన ప్రేమ, నమ్మకం ఉన్నాయి. సెక్యులర్ ప్రొగ్రసివ్ అలయెన్స్ 200కు పైగా సీట్లలో గెలిచి ద్రవిడియన్ మోడల్ 2.0 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది' అని స్టాలిన్ తెలిపారు. కాంగ్రెస్‌తో సీట్ల పంపకాల వ్యవహారంలో ఈసారి సంక్లిష్టంగా మారడంపై అడిగినప్పుడు, సీట్ల కేటాయింపు విషయంలో అలాంటివి మామూలేనని, అయితే చర్చలు సుహృద్భావ వాతావరణంలో ముగిసాయని చెప్పారు. కూటమిలోని నేతలు, కార్యకర్తలు సమష్టిగా అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నారని చెప్పారు. 2019 నుంచి తమ కూటమి మరింత బలపడిందని, మరిన్ని పార్టీలు వచ్చి చేరాయని చెప్పారు. తమిళనాడులోనే కాకుండా పుదుచ్చేరిలోనూ తమ కూటమి గెలుపు సాధిస్తుందని చెప్పారు. ఏప్రిల్ 9న పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది.


పవర్ సెంటర్ వ్యాఖ్యలపై..

ముఖ్యమంత్రి కుటుంబం పవర్ సెంటర్‌లా వ్యవహరిస్తోందంటూ అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి పళనిస్వామి ఆరోపణలను స్టాలిన్ కొట్టివేశారు. పళనిస్వామి కట్టుకథలపై తాను స్పందించాల్సిన పనిలేదని అన్నారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలపై పళనిస్వామి చేస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ, పొల్లాచ్చి లైంగిక దాడుల ఘటన పళనిస్వామి సారథ్యంలోని అన్నాడీఎంకే అవకతవకల పాలనకు ఒక నిదర్శనమని, అప్పటి మహిళా ఐపీఎస్‌పై కూడా లైంగిక వేధింపులు జరిగాయని చెప్పారు. మహిళల భద్రతపై కానీ, శాంతిభద్రతలపై కానీ పళనిస్వామికి మాట్లాడే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. తమిళనాడును గుట్కా గిడ్డంగిగా ఆయన మార్చారని, తాము అధికారంలోకి వచ్చాక కఠిన చర్యలు తీసుకుని గుట్కా సహా మాదకద్రవ్యాలను తుడిచిపెట్టామని, కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పారు.


ఉద్యోగాలు చేసే మహిళల భద్రతకు హాస్టళ్లు ఏర్పాటు చేశామని, మహిళలపై నేరాలకు కఠిన చర్యలు అమలయ్యేలా సంబంధిత చట్టాలలో మార్పులు చేశామని స్టాలిన్ చెప్పారు. తమిళనాడులో వర్కింగ్ ఉమెన్స్ ఎక్కువనీ, వారి భద్రతకు తాము భరోసాగా ఉన్నామని తెలిపారు. మహిళల భద్రత విషయంలో దేశంలోనే తమిళనాడు నెంబర్ వన్‌ స్థానంలో ఉందని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

నా అభ్యర్థిత్వానికి ఎసరు పెట్టాలనుకున్నారు.. బీజేపీపై మమత తీవ్రారోపణ

బెంగాల్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే శాంతి భద్రతలు: ప్రధాని నరేంద్ర మోదీ

Updated Date - Apr 11 , 2026 | 05:10 PM