పాత మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలుచేయాలి.. ప్రధానికి ఇండియా కూటమి లేఖ
ABN , Publish Date - Apr 18 , 2026 | 04:37 PM
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఆమోదించిన 2023 చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేశారు. ఈమేరకు ప్రధానమంత్రికి లేఖ రాయనున్నట్టు తెలిపారు.
న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఆమోదించిన 2023 చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని ఇండియా కూటమి (INDIA alliance) నేతలు డిమాండ్ చేశారు. ఈమేరకు ప్రధానమంత్రికి లేఖ రాయనున్నట్టు తెలిపారు. ఇండియా కూటమి నేతలు శనివారంనాడిక్కడ సమావేశమయ్యారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము వ్యతిరేకం కాదని, అయితే బిల్లు ముసుగులో దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని విపక్ష నేతలు ఆరోపించారు. ఇదే విషయాన్ని ప్రజల ముందుకు తీసుకు వెళ్లేందుకు దేశవ్యాప్తంగా మీడియా సమావేశాలు నిర్వహించనున్నట్టు 'ఇండియా' కూటమి నేతలు తెలిపారు.
ప్రియాంక సవాల్..
'ఇండియా' కూటమి ప్రత్యేక సమావేశం సందర్బంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడుతూ, విస్తృత ఏకాభిప్రాయంతో పార్లమెంటులో ఆమోదించిన పాత మహిళా రిజర్వేషన్ బిల్లును తిరిగి సభలో ప్రవేశపెట్టాలని అన్నారు. 'సోమవారం పార్లమెంటు నిర్వహించండి. బిల్లు తీసుకురండి. ఎవరు మహిళా వ్యతిరేకులో అప్పుడు చూడండి. మేమంతా మీకు సపోర్ట్‌గా ఓటు వేస్తాం' అని తెలిపారు.
బీజేపీ నిరసనలు
కాగా, మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు ఓడించినందుకు నిరసనగా కాంగ్రెస్ నేతల ఇళ్ల ముందు నిరసన చేపట్టాలని పార్టీ శ్రేణులకు బీజేపీ పిలుపునిచ్చింది. మహిళా రిజర్వేషన్లు, చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు స్థానాలు పెరగడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని ఆరోపించింది.
ఇవి కూడా చదవండి..
రాత్రి 8.30 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోదీ
మహిళా బిల్లును వ్యతిరేకించి విపక్షాలు తప్పు చేశాయి: మోదీ