Share News

సవరణతో తిరిగి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన విపక్షాలు

ABN , Publish Date - Feb 10 , 2026 | 06:41 PM

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు మంగళవారంనాడు ఇచ్చిన నోటీసులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ లోపాన్ని సరిచేసి విపక్ష ఎంపీలు తిరిగి నోటీసును లోక్‌సభ సెక్రటరీకి అందజేశారు.

సవరణతో తిరిగి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన విపక్షాలు
Om Birla

న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు మంగళవారంనాడు ఇచ్చిన నోటీసులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ లోపాన్ని సరిచేసి విపక్ష ఎంపీలు తిరిగి నోటీసును లోక్‌సభ సెక్రటరీకి అందజేశారు. విపక్షాల నోటీసును పరిశీలించాల్సిందిగా లోక్‌సభ సెక్రటేరియట్‌ను ఓం బిర్లాను ఆదేశించడంతో ఈ సాంకేతిక లోపం బయటపడింది. విపక్షాలు మొదట ఇచ్చిన నోటీసులో 2026 సంవత్సరానికి బదులుగా 2025 సంవత్సరం అని ఉంది. వెంటనే పొరపాటును సరిచేసి రెండోసారి అవిశ్వాస తీర్మానం నోటీసును లోక్‌సభ సెక్రటరీకి విపక్షాలు అందజేశాయి.


ఇండియా కూటమికి చెందిన 118 మంది ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసుపై సంతకాలు చేశారు. సభలో మాట్లాడేందుకు విపక్ష నేతలకు స్పీకర్ అవకాశం ఇవ్వడం లేదంటూ ఈ నోటీసు ఇచ్చారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ, డీఎంకే పార్టీలు దీనికి మద్దతు పలుకగా, తృణమూల్ కాంగ్రెస్ ఇంతవరకూ సంతకం చేయలేదు. ఈ ప్రక్రియను సమీక్షించనున్నట్టు టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ తెలిపారు.


రాహుల్ సైతం..

అవిశ్వాస తీర్మానంపై రాహుల్ గాంధీ సంతకం చేయలేదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో స్పీకర్ తొలగింపు పిటిషన్‌పై ప్రతిపక్ష నేత సంతకం చేయడం సరైంది కాదని, రాహుల్ గాంధీ సంతకం చేయకపోవడానికి అదే కారణమని పేర్కొన్నాయి. కాగా, అవిశ్వాస తీర్మానం పరంగా లోక్‌సభలో బలాబలాలను చూసినప్పుడు లోక్‌సభలో అధికార పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. 293 మందితో మెజారిటీ సభ్యుల బలం వారికి ఉండగా, విపక్షాలకు 214 మంది సభ్యుల బలం ఉంది.


ఇవి కూడా చదవండి..

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం.. నోటీసులిచ్చిన కాంగ్రెస్

బాబ్రీ పునర్నిర్మాణం అసాధ్యం: యోగి ఆదిత్యనాథ్

Updated Date - Feb 10 , 2026 | 06:52 PM