మంత్రులు, డిప్యూటీ సీఎంలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.. మల్లికార్జున్ ఖర్గే
ABN , Publish Date - May 31 , 2026 | 03:16 PM
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణస్వీకారం చేయనుండగా ఆయన క్యాబినెట్‌లో ఎందరు మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఉంటారనేది దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు.
కలబురగి: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ (DK Shivakumar) జూన్ 3న ప్రమాణస్వీకారం చేయనుండగా ఆయన క్యాబినెట్‌లో ఎందరు మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఉంటారనేది దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Khrge) తెలిపారు. ఆదివారంనాడు కలబురగి విమానాశ్రయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, మంత్రులు, ఉప ముఖ్యమంత్రులపై ఇంకా ఎలాంటి ప్రతిపాదన రాలేదని, అది రాగానే ఒక నిర్ణయం తీసుకుంటామని, జూన్ 3 తర్వాత మరింత స్పష్టత వస్తుందని చెప్పారు.
నెల రోజుల్లో మంత్రివర్గ విస్తరణ
'డీకే మంత్రివర్గంలో 8 మంది ఉంటారా 10 మంది ఉంటారా అనేది దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. ఒక నిర్ణయానికి రాగానే తొలి విడత మంత్రివర్గం ఏర్పాటు జరుగుతుంది. తక్కిన వారిని రెండో విడతలో మంత్రివర్గంలో తీసుకుంటాం. అది బహుశా 15 నుంచి నెల రోజుల్లో ఉండవచ్చు' అని ఖర్గే వివరించారు.
కేపీసీసీ అధ్యక్షుడిపై..
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) అధ్యక్షుడి నియామకంపై మాట్లాడుతూ, శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే కేపీసీసీ అధ్యక్షుడి ఎంపిక సహజంగానే జరుగుతుందన్నారు. ప్రతిభ, టీమ్ డైనమిక్స్‌ను పరిగణనలోనికి తీసుకుని సరైన వ్యక్తి కోసం వెతుకుతున్నామని, ఎన్నికలకు మరో 24 నెలలు ఉన్నందున పార్టీ భవిష్యత్తును మరింత బలోపేతం చేసే వ్యక్తి అవసరమని అన్నారు. అందర్నీ కలుపుకుని వెళ్లే సమర్ధుడైన నేతను ఎంపిక చేస్తామని చెప్పారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో సిద్ధరామయ్య రాజీనామా చేయడంతో డీకే శివకుమార్ సీఎల్‌పీ నేతగా ఎన్నికై, ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారానికి సిద్ధమవుతున్నారు. జూన్ 3వ తేదీ మధ్యాహ్నం 4.05 గంటలకు బెంగళూరులోని లోక్ భవన్‌లో సీఎంగా ఆయన ప్రమాణస్వీకారం చేస్తారు.
ఇవి కూడా చదవండి..
హిమాచల్ ప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ హవా
భారత అథ్లెటిక్స్‌కు స్వర్ణయుగం.. 'మన్ కీ బాత్'లో ప్రధాని ప్రశంసలు