Share News

నోయిడా అల్లర్లకు పాకిస్థాన్‌తో సంబంధాలు: మంత్రి సంచలన కామెంట్లు..

ABN , Publish Date - Apr 14 , 2026 | 10:44 AM

నోయిడాలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలకు పాల్పడిన 300 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. మరో 100 మందికి పైగా విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. వేతనాల పెంపు, 8 గంటల పని కోసం నిన్న(సోమవారం) కార్మికులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది.

నోయిడా అల్లర్లకు పాకిస్థాన్‌తో సంబంధాలు: మంత్రి సంచలన కామెంట్లు..
Noida protests

ఉత్తరప్రదేశ్: నోయిడాలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలకు పాల్పడిన 300 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. మరో 100 మందిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. వేతనాల పెంపు, 8 గంటల పని కోసం నిన్న(సోమవారం) కార్మికులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. నోయిడాలోని ఫేజ్-2, సెక్టార్ 60, సెక్టార్ 62, సెక్టార్ 84 సహా పలు ప్రాంతాల్లో కార్మికులు ఆందోళనకు దిగారు. పలు వాహనాలను తగులపెట్టి.. భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వారు. జాతీయ రహదారి -9 సహా పలు రోడ్లను దిగ్బంధించారు. దీంతో నోయిడా- ఢిల్లీ సరిహద్దుల్లో తీవ్ర ట్రాఫిక్ సమస్య తలెత్తెంది. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువులు సైతం ప్రయోగించారు.


అయితే, కార్మికుల హింసాత్మక ఘటనలపై ఉత్తర ప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి అనిల్ రాజ్‌భర్ స్పందించారు. దాడిని పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన హింసగా అభివర్ణించారు. పాకిస్థాన్‌ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఇటీవల నోయిడా, మీరట్‌లలో నలుగురు అనుమానితులు అరెస్టయిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. నిన్నటి దాడికి పాకిస్థాన్‌తో సంబంధం ఉందేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఆ కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు. అస్థిరతను సృష్టించే ఉద్దేశంతోనే ఈ ఘటన జరిగి ఉండొచ్చని ప్రాథమిక విచారణలో తేలిందని మంత్రి రాజ్‌భర్ చెప్పారు.


రాష్ట్రంలో అస్థిరతను సృష్టించేందుకు దేశ వ్యతిరేక శక్తులు ప్రయత్నిస్తున్నాయని మంత్రి ఆరోపించారు. ముజఫర్‌నగర్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కార్యక్రమానికి అంతరాయం కలిగించే కుట్రలో భాగంగానే ఈ అల్లర్లు జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కార్మికులు ప్రశాంతంగా ఉండాలని, రెచ్చగొట్టే చర్యలకు, తప్పుడు సమాచారానికి ప్రభావితం కాకూడదని విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యలు వినేందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు. మరోవైపు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు నోయిడాకు చేరుకుని కార్మికులతో సంప్రదింపులు జరుపుతున్నారని మంత్రి రాజ్ భర్ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

దేశ నిర్మాణంలో అంబేడ్కర్ కృషి స్ఫూర్తిదాయకం: ప్రధాని మోదీ

పత్తాలేని ఫాగింగ్‌..!

Updated Date - Apr 14 , 2026 | 11:06 AM