Share News

పత్తాలేని ఫాగింగ్‌..!

ABN , Publish Date - Apr 14 , 2026 | 10:41 AM

ప్రతీ ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని దోమ కాటుకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఉచిత సలహా ఇస్తున్నారే కానీ.. దోమల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు.

పత్తాలేని ఫాగింగ్‌..!

  • ఓల్డ్‌బోయినపల్లి, హస్మత్‌పేటలో విజృంభిస్తున్న దోమలు

  • విషజ్వరాల బారిన కాలనీవాసులు

  • మూడు డివిజన్లకు ఒక్కరే ఎంటమాలాజీ సూపర్‌వైజర్‌

హైదరాబాద్: ప్రతీ ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని దోమ కాటుకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఉచిత సలహా ఇస్తున్నారే కానీ.. దోమల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధి బోయినపల్లి సర్కిల్‌ పరిధిలో ఉన్న బేగంపేట, హస్మత్‌పేట, ఓల్డ్‌ బోయినపల్లి డివిజన్‌ల పరిధిలో సుమారు లక్ష యాభైవేల పై చిలుకు జనాభా నివసిస్తున్నారు.


మూడు డివిజన్లకు కలిపి ఒకే సూపర్‌వైజర్‌ విధులు నిర్వహిస్తున్నాడు. గతంలో అక్కడ పనిచేసిన అవుట్‌ సోర్సింగ్‌ సూపర్‌వైజర్‌ను ఫిబ్రవరి 12న శేరిలింగంపల్లి నియోజకవర్గం.. ఆల్విన్‌ కాలనీకి బదిలీచేశారు. ఇప్పటికే బేగంపేటలో విధులు నిర్వహిస్తున్న సూపర్‌వైజర్‌కు అదనంగా ఓల్డ్‌ బోయినపల్లి, హస్మత్‌పేట డివిజన్‌లు కేటాయించారు. దీంతో ఎంటమాలాజీ సిబ్బంది తీరుతో ఇటు హస్మత్‌పేట, అటు ఓల్డ్‌ బోయినపల్లివాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.


city4.jpgమూడునెలలుగా కనిపించని ఫాగింగ్‌

ఓల్డ్‌బోయినపల్లి, హస్మత్‌పేట పరిధిలో ఫాగింగ్‌కు సంబంధించిన మిషన్‌లు లేకపోవడంతో రెండు డివిజన్‌లలో సరైన ఫాగింగ్‌ జరగడం లేదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. కొన్ని నెలల క్రితం తూతూ మంత్రంగా ఫాగింగ్‌ చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో అంజయ్యనగర్‌తో పాటు పలు కాలనీలవాసులు దోమల విజృంభనతో తలలు పట్టుకుంటున్నారు.


రోగాల బారిన పడుతున్న కాలనీ వాసులు..

దోమల బాధతో రెండు డివిజన్లకు చెందిన కాలనీవాసులు రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా మలేరియ, డెంగీ, టైఫాయిడ్‌తో పాటు పలు రకాల విషజ్వరాల బారిన పడుతున్నారు. ఏళ్లుగా హస్మత్‌పేటలో ఉన్న బోయినిచెరువులో గుర్రపుడెక్క పేరుకుపోయి ఉంది. వారం రోజుల క్రితమే గుర్రపుడెక్క తొలగించే పనులను ప్రారంభించినా.. పనులు నత్తనడకన సాగుతున్నాయి.


భయపెడుతున్న దోమలు..

సాయంత్రం అయిందంటే చాలు దోమలు ఇళ్లలోకి దూరిపోతున్నాయి. ఇంట్లో కునుకు తీయలేని పరిస్థితి నెలకొందని చిరు ఉద్యోగులు, రోజువారి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లిక్విడ్స్‌, కాయిల్స్‌, ఎలక్ట్రిక్‌ బ్యాట్‌లను విరివిగా ఉపయోగిస్తూ వారు తంటాలు పడుతున్నారు.

అధికారులకు సమాచారం ఇచ్చాం

హస్మత్‌పేట, ఓల్డ్‌ బోయినపల్లిలో అధికారులకు సమాచారం ఇచ్చాం. ప్రతీ కాలనీలో ఫాగింగ్‌ తోపాటు దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. బోయినపల్లి, హస్మత్‌పేట రెండు డివిజన్‌లకు రెండు ఫాగింగ్‌ మిషన్‌లు సమాకూర్చేందుకు కృషిచేస్తున్నాం.

- ముద్దం నర్సింహాయాదవ్‌, మాజీ కార్పొరేటర్‌, ఓల్డ్‌బోయినపల్లి


దోమలను అరికట్టాలి

సాయంత్రం ఇంటినుంచి బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ఇప్పటికే దోమ కాటుతో పలువురు రోగాల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. ఎంటమాలాజీ సిబ్బంది ఉన్నారో.. లేదో తెలియడం లేదు.. మూడు నెలలుగా అసలు ఫాగింగ్‌ చేయడం లేదు. చెరువులో గుర్రపుడెక్క తొలగింపులో వేగంపెంచి, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి.

- ఏనుగుల తిరుపతి, బీజేపీ సీనియర్‌నాయకుడు, ఓల్డ్‌బోయినపల్లి


ఈ వార్తలు కూడా చదవండి:

పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. తగ్గిన పసిడి, వెండి ధరలు

అమ్మా.. ఇంకా బతికున్నానే..!

Read Latest Telangana News and National News

Updated Date - Apr 14 , 2026 | 10:41 AM