అర్హులైన ఏ ఒక్క ఓటరునూ తొలగించం: సీఈసీ జ్ఞానేశ్ కుమార్
ABN , Publish Date - Mar 10 , 2026 | 04:14 PM
ఓటర్ల జాబితా నుంచి అర్హులైన ఏ ఒక్క ఓటరునూ తొలగించేది లేదని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. పశ్చిమబెంగాల్‌లో స్వేచ్ఛగా, సజావుగా, ప్రశాంతంగా ఎన్నికలు జరపడానికే ఎన్నికల సంఘం మొదటి ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు.
కోల్‌కతా: ఓటర్ల జాబితా నుంచి అర్హులైన ఏ ఒక్క ఓటరును తొలగించేది లేదని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kuamr) తెలిపారు. పశ్చిమబెంగాల్‌లో స్వేచ్ఛగా, సజావుగా, ప్రశాంతంగా ఎన్నికలు జరపడానికే ఎన్నికల సంఘం మొదటి ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈసీ ఆదేశాల మేరకు పనిచేయాల్సి ఉంటుందని, ఎలాంటి లోటుపాట్లను సహించేది లేదని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీలు, అధికారులతో వరుస సమావేశాల అనంతరం మీడియాతో సీఈసీ మంగళవారంనాడు మాట్లాడారు.
పశ్చిమబెంగాల్‌లో 80,000 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, వీటిలో 61,000 బూత్‌లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయని సీఈసీ చెప్పారు. ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకత, అవకతవకల నిరోధానికి అన్ని పోలింగ్ బూత్‌లలో వెబ్‌కాస్టింగ్ ప్రక్రియ అమలు చేస్తామని తెలిపారు. రాజ్యంగం ప్రకారమే ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించామని, పూర్తిగా పారదర్శకతంగా జరిగిందని తెలిపారు. ఢిల్లీ వెళ్లిన తర్వాత ఎన్నికల కమిషన్ సమీక్షా సమావేశం జరుపుతుందని చెప్పారు.
నల్లజెండాలతో నిరసనలు
కాగా, ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు వచ్చిన సీఈసీకి మంగళవారంనాడు కూడా నిరసనల సెగ తప్పలేదు. మంగళవారం ఉదయం దక్షిణేశ్వర్ కాళి ఆలయాన్ని సందర్శించేందుకు ఆయన వచ్చినప్పుడు కొందరు నల్లజెండాలతో నిరసన తెలుపుతూ 'గో బ్యాక్' నినాదాలు చేశారు. ఆదివారం రాత్రి సీఈసీ రాక సందర్భంగా నేతాజి సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం బయట కూడా ఇలాంటి నిరసన ప్రదర్శనలు చేటుచేసుకున్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియ అనంతరం విడుదల చేసిన ఓటర్ల తుదిజాబితా నుంచి పక్షపాత ధోరణితో పెద్దఎత్తున పేర్లు తొలగించారని నిరసన ప్రదర్శకులు ఆరోపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం.. లోక్‌సభలో ప్రారంభమైన చర్చ..
యుద్ధం ఎఫెక్ట్.. ఎల్పీజీ కొరతతో మూతపడుతున్న హోటళ్లు..