Share News

చిలుక జోస్యం పేరుతో భారీ మోసం.. లక్షలు పోగొట్టుకున్న ఐటీ అధికారి..

ABN , Publish Date - Mar 10 , 2026 | 12:39 PM

బెంగళూరులో ఓ కేటుగాడు చిలుక జోస్యం పేరిట ఆదాయపన్ను శాఖ అధికారికి కుచ్చుటోపీ పెట్టాడు. అదృష్టం పదింతలు అయ్యేలా చేస్తానని చెప్పి.. లక్షల రూపాయలు దోచేశాడు.

చిలుక జోస్యం పేరుతో భారీ మోసం.. లక్షలు పోగొట్టుకున్న ఐటీ అధికారి..
Bengaluru parrot astrologer scam

బెంగళూరు, మార్చి 10: ఓ కేటుగాడు చిలుక జోస్యం పేరిట ఆదాయపన్ను శాఖ అధికారికి కుచ్చుటోపీ పెట్టాడు. అదృష్టం పదింతలు అయ్యేలా చేస్తానని చెప్పి.. లక్షల రూపాయలు దోచేశాడు. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరులోని భారతి నగర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన వీ సత్యనారాయణ్ ఆదాయపన్ను శాఖలో నాన్ గెజిటెడ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సత్యనారాయణ్‌కు కొన్ని నెలల క్రితం ఫుట్‌పాత్‌పై చిలుక జోస్యం చెప్పే శేఖర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.


చిలుక జోస్యం ద్వారా భవిష్యత్తు చెబుతానని, ప్రత్యేక పూజల ద్వారా అదృష్టాన్ని పదింతలు చేస్తానని శేఖర్ నమ్మించాడు. శేఖర్ మాటలు నమ్మిన సత్యనారాయణ్ పూజల కోసం మొదటి సారి 50 వేల రూపాయలు ఇచ్చాడు. పూజ జరిగినా సత్యనారాయణ్ జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు. పెద్ద పూజలు చేస్తే ఫలితం అద్భుతంగా ఉంటుందని శేఖర్ చెప్పాడు. పూజల కోసం ఇంట్లోని బంగారం, వెండి తీసుకురమ్మన్నాడు. పూజలు అయిపోయిన వెంటనే తిరిగి ఇస్తానన్నాడు. శేఖర్ మాటలు నమ్మిన సత్యనారాయణ్ 194 గ్రాముల బంగారం, 1.3 కేజీల వెండిని తీసుకెళ్లి ఇచ్చాడు.


వారం రోజులు గడిచిపోయాయి. శేఖర్‌ను బంగారం, వెండి గురించి అడగ్గా.. పూజలు ఇంకా జరుగుతూనే ఉన్నాయని చెప్పాడు. సత్యనారాయణ్‌కు అనుమానం వచ్చింది. శేఖర్ ఉండే శ్రీ సర్కిల్‌కు వెళ్లాడు. అక్కడ శేఖర్ కనిపించలేదు. మోసపోయానని గ్రహించిన సత్యనారాయణ్ పోలీసులను ఆశ్రయించాడు. శేఖర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

విజయ్‌ పార్టీతో పొత్తులేదు..

మళ్లీ అదే చోట కారు బోల్తా

Updated Date - Mar 10 , 2026 | 12:49 PM