యుద్ధం ఎఫెక్ట్.. ఎల్పీజీ కొరతతో మూతపడుతున్న హోటళ్లు..
ABN , Publish Date - Mar 10 , 2026 | 10:52 AM
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవటంతో బెంగళూరు, చెన్నై, ముంబైలలోని హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నగరాల్లోని దాదాపు 20 శాతం హోటళ్లు మూతపడ్డాయి.
న్యూఢిల్లీ, మార్చి 10: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా పెట్రోల్, గ్యాస్, ఎరువుల దిగుమతులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా ఎల్పీజీ కొరత ఏర్పడింది. గ్యాస్ కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ల ధరను భారీగా పెంచేశాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లతో పాటు డొమస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధర పెరిగింది. డొమస్టిక్ సిలిండర్లపై 60 రూపాయలు.. కమర్షియల్ సిలిండర్లపై 115 రూపాయలు పెరిగింది. అంతేకాదు.. వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు ఎల్పీజీ సరఫరా నిలిచిపోయింది.
మూతపడుతున్న హోటళ్లు, రెస్టారెంట్లు
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవటంతో బెంగళూరు, చెన్నై, ముంబైలలోని హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నగరాల్లోని దాదాపు 20 శాతం హోటళ్లు మూతపడ్డాయి. ‘ది బెంగళూరు హోటల్స్ అసోసియేషన్’ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో.. ‘గ్యాస్ సరఫరా నిలిచిపోవటంతో.. రేపటినుంచి హోటల్స్ మూతపడనున్నాయి. భోజనం కోసం హోటల్స్‌పై ఆధారపడిన సాధారణ ప్రజలు, విద్యార్థులు, మెడికల్ ప్రొఫెషనల్స్ ఇబ్బందులు పడకతప్పదు. గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి వచ్చే వరకు మా హోటల్ ఇండస్ట్రీ ఇబ్బందులు పడక తప్పదు. ఈ విషయంలో కేంద్రం త్వరగా సరైన చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొంది.
చెన్నై హోటల్స్ అసోసియేషన్ కూడా సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో .. ‘పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే డిస్ట్రిబ్యూటర్లు గ్యాస్ సిలిండర్ల సప్లైని పూర్తిగా ఆపేశారు. స్టాక్ లేదని అంటున్నారు. దీని ఫలితంగా చాలా హోటళ్లు బలవంతంగా మూసేయాల్సి వస్తోంది’ అని పేర్కొంది.
ప్రభుత్వం కలుగజేసుకోవాలి..
‘ది నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాపై స్పందించింది. ఈ మేరకు సోమవారం ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో.. ‘రెస్టారెంట్ ఇండస్ట్రీకి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాపై ఎటువంటి నిషేధం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. సప్లయర్లు గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయలేమని చేతులు ఎత్తేస్తున్నారు. ఇది రెస్టారెంట్ ఇండస్ట్రీపై, ఆహార సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది’ అని రాసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో కలుగజేసుకోవాలని కోరింది.
ఇవి కూడా చదవండి
నష్టాల నుంచి ఉపశమనం.. కోలుకుంటున్న దేశీయ సూచీలు..
పెరిగిన వెండి, బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే