Share News

వెయ్యేళ్ల నాటి చోళుల రాగి ఫలకాలు.. భారత్‌కు తిరిగి అప్పగించిన నెదర్లాండ్స్..

ABN , Publish Date - May 16 , 2026 | 09:47 PM

భారత్‌కు చెందిన వెయ్యేళ్ల నాటి చారిత్రక సంపద అయిన అనైమంగలం చోళ రాగి ఫలకాలను నెదర్లాండ్స్ అధికారికంగా తిరిగి అప్పగించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా ఈ చారిత్రక సంఘటన జరిగింది.

వెయ్యేళ్ల నాటి చోళుల రాగి ఫలకాలు.. భారత్‌కు తిరిగి అప్పగించిన నెదర్లాండ్స్..
Chola copper plates returned

భారత్‌కు చెందిన వెయ్యేళ్ల నాటి చారిత్రక సంపద అయిన అనైమంగలం చోళ రాగి ఫలకాలను (Anaimangalam Copper Plates) నెదర్లాండ్స్ అధికారికంగా తిరిగి అప్పగించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా ఈ చారిత్రక సంఘటన జరిగింది. శతాబ్దాల క్రితం వలస పాలనా కాలంలో యూరప్‌నకు తరలించిన ఈ అరుదైన కళాఖండాలు ఇప్పుడు తిరిగి భారత్‌కు చేరుతున్నాయి (Chola copper plates returned).


ఈ రాగి ఫలకాలు చోళ చక్రవర్తి రాజరాజ చోళ-I పాలనా కాలానికి చెందినవి. వీటిని క్రీ.శ. 985 నుంచి 1014 మధ్య కాలంలో రూపొందించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. మొత్తం 21 పెద్ద రాగి ఫలకాలు, మూడు చిన్న ఫలకాలు కలిపి సుమారు 30 కిలోల బరువుతో ఉంటాయి. ఈ ఫలకాలపై తమిళం, సంస్కృతంలో శాసనాలను చెక్కారు. నాగపట్టణంలోని ఒక బౌద్ధ మఠానికి చేసిన దానాలను ఈ శాసనాలు నమోదు చేశాయి. చోళుల కాలంలో దక్షిణ భారతదేశం, ఆగ్నేయాసియా దేశాల మధ్య ఉన్న వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలకు వీటిని కీలక ఆధారాలుగా భావిస్తున్నారు (Netherlands India cultural artefacts).


18వ శతాబ్దంలో నాగపట్టణం డచ్ వారి నియంత్రణలో ఉండేది. ఆ కాలంలో ఈ ఫలకాలను నెదర్లాండ్స్‌కు తరలించారు (PM Modi Netherlands visit). అప్పట్నుంచి అవి అక్కడే ఉండిపోయాయి. ఈ ఫలకాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు భారత్ 2012 నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. యునెస్కో మద్దతుతో జరిగిన దౌత్య చర్చల తర్వాత చివరకు నెదర్లాండ్స్ వాటిని తిరిగి ఇవ్వడానికి అంగీకరించింది. ప్రతి భారతీయుడికి ఇది ఒక ఆనందకర క్షణమని, 11వ శతాబ్దానికి చెందిన చోళుల రాగి ఫలకాలు నెదర్లాండ్స్ నుంచి భారతదేశానికి తిరిగి రానున్నాయని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

తైవాన్ కోసం చైనాతో యుద్ధం చేయలేం: ట్రంప్


పాక్ తీరు మారకుంటే.. చరిత్రలో కలిసిపోతుంది: భారత ఆర్మీ చీఫ్

Updated Date - May 16 , 2026 | 09:51 PM