Share News

పాక్ కంటెంట్‌పై నో ఎంట్రీ.. నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం హెచ్చరిక

ABN , Publish Date - Nov 26 , 2026 | 02:08 PM

ఫవాద్-మహిరా సిరీస్ వివాదం వేళ కేంద్రం నెట్‌ఫ్లిక్స్‌కు హెచ్చరిక చేసింది. భారత్‌లో పాకిస్థాన్ కంటెంట్ స్ట్రీమింగ్‌కు నో ఎంట్రీ చెప్పింది. గత నిబంధనలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది.

పాక్ కంటెంట్‌పై నో ఎంట్రీ.. నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం హెచ్చరిక
Netflix Pakistani content ban

ఢిల్లీ, నవంబర్ 26: పాకిస్థాన్ నటీనటులు ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన పాకిస్థానీ వెబ్ సిరీస్ ‘జో బచే హై సంగ్ సమేట్ లో’ (Jo Bachay Hain Sang Samait Lo) భారత్‌లో విడుదల కానుందన్న వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. భారత్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఎలాంటి కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేయకూడదని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (MIB) ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) కు మరోసారి స్పష్టం చేసింది.

గత నిబంధనలకు కట్టుబడి ఉండాలన్న కేంద్రం

2025 ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో, జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్ నుంచి వచ్చే వెబ్ సిరీస్‌లు, సినిమాలు, పాటలు, పాడ్‌కాస్ట్‌లను నిలిపివేయాలని 2025 మే 8న కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు అడ్వైజరీ జారీ చేసింది. ఆ సమయంలో (జూన్ 2025లో) భారత్‌లోని తమ సబ్‌స్క్రైబర్లకు పాకిస్థాన్‌లో నిర్మించిన ఏ సినిమా గానీ, సిరీస్ గానీ అందుబాటులో ఉంచలేదని నెట్‌ఫ్లిక్స్ ప్రభుత్వానికి హామీ ఇచ్చింది.

ఇప్పుడు డిసెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ కానున్న ‘జో బచే హై సంగ్ సమేట్ లో’ సిరీస్‌పై ఫిర్యాదులు రావడంతో, గతంలో ఇచ్చిన హామీకి, ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ నెట్‌ఫ్లిక్స్‌కు గుర్తుచేసింది.

సినీ కార్మిక సంఘాల తీవ్ర అభ్యంతరం

ఈ సిరీస్ భారత్‌లో ప్రసారం కాకుండా నిషేధించాలని కోరుతూ రెండు ప్రధాన సినీ కార్మిక సంఘాలు ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA), ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాశాయి. నవంబర్ 24న AICWA అధ్యక్షుడు సురేష్ శ్యామ్‌లాల్ గుప్తా ప్రధానికి రాసిన లేఖలో, పాకిస్థాన్ కంటెంట్, కళాకారులను భారత థియేటర్లు, టీవీ ఛానెళ్లు, ఓటీటీల్లో శాశ్వతంగా నిషేధించేలా కఠిన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. మరుసటి రోజే FWICE సైతం దేశ ప్రజల మనోభావాలను గౌరవించి ఈ సిరీస్ విడుదలను అడ్డుకోవాలని కోరింది.

మరోవైపు, బెంగళూరులో నవంబర్ 28, డిసెంబర్ 5 తేదీల్లో జరగాల్సిన ‘దార్-ఎ-నిజాత్’ (Dar-e-Nijaat) అనే మరో పాకిస్థానీ డ్రామా ప్రత్యేక ప్రదర్శనలు సైతం సోషల్ మీడియాలో వచ్చిన తీవ్ర వ్యతిరేకత కారణంగా రద్దయ్యాయి.

ఏంటీ ‘జో బచే హై సంగ్ సమేట్ లో’ సిరీస్?

ప్రముఖ ఉర్దూ రచయిత్రి ఫర్హత్ ఇష్తియాక్ రాసిన నవల ఆధారంగా, మోమినా దురైద్ దర్శకత్వం, నిర్మాణంలో ఈ రొమాంటిక్ డ్రామా తెరకెక్కింది.

నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన తొలి ఉర్దూ ఒరిజినల్ సిరీస్ ఇదే. ఇందులో ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్‌లతో పాటు హనియా అమీర్, అహద్ రజా మీర్, ఇక్ర అజీజ్, సనమ్ సయీద్ తదితరులు నటించారు. ఈ వివాదంపై నెట్‌ఫ్లిక్స్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. (Netflix Pakistani content ban)


ఇవి కూడా చదవండి...

కుటుంబంతో కలిసి ఓటు వేసిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్.. ఉదయం 8 గంటలకు 8.32 శాతం నమోదు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 26 , 2026 | 02:08 PM