నేపాల్‌కు పొంచి ఉన్న మరో ప్రమాదం.. కొత్తగా రెండు హిమ సరస్సుల గుర్తింపు..
ABN , Publish Date - Aug 29 , 2026 | 10:03 AM
నేపాల్‌లో వరదల నుంచి కోలుకోక ముందే మరో షాకింగ్ విషయం వెలుగు వచ్చింది. ప్రమాదానికి కారణమైన భోటే కోషి-త్రిశూలి నదీ వ్యవస్థ సమీపంలోనే మరో రెండు హిమానీనద సరస్సులు ఏర్పడ్డాయని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అధిపతి కృష్ణ వాట్సా తెలిపారు.
ఖాఠ్మాండూ: నేపాల్‌లో వరదల నుంచి కోలుకోక ముందే మరో షాకింగ్ విషయం వెలుగు వచ్చింది. ప్రమాదానికి కారణమైన భోటే కోషి-త్రిశూలి నదీ వ్యవస్థ సమీపంలోనే మరో రెండు హిమానీనద సరస్సులు ఏర్పడ్డాయని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అధిపతి కృష్ణ వాట్సా తెలిపారు. అయితే వీటి నుంచి ఎంతమేర వరదనీరు బయటకు వచ్చే అవకాశం ఉందన్న దానిపై ప్రస్తుతం స్పష్టమైన అంచనాలు లేవని ఆయన వెల్లడించారు. ఒక సరస్సు 19.80 హెక్టార్లు, మరొకటి 7.28 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నట్లు పేర్కొన్నారు. సరస్సుల్లోని నీటి పరిమాణంపై ఇప్పటివరకు ఎలాంటి అంచనా లేదని ఆయన చెప్పుకొచ్చారు.
అయితే అక్కడ హిమానీనదాలు కదులుతున్నప్పుడు పేరుకుపోయే రాళ్లు, మట్టి, ఇతర శిథిలాల కుప్పలు ఉన్నాయని కృష్ణ వాట్సా వెల్లడించారు. నేపాల్‌లో ఏర్పడిన ఈ సహజ సరస్సుల పరిస్థితిని భారత్ నేరుగా పరిశీలించే అవకాశం పరిమితంగా ఉండటంతో నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉందన్నారు. సహజంగా ఏర్పడే ఇలాంటి సరస్సులు భవిష్యత్తులో ఎలా మారతాయో పూర్తిగా అంచనా వేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు. మరోవైపు, ఇదే ప్రాంతంలో కొత్తగా ఏర్పడిన సరస్సును నోయిడాకు చెందిన సుహోరా టెక్నాలజీస్ గుర్తించింది. ఆగస్టు 27న తీసిన అత్యంత స్పష్టమైన ఉపగ్రహ చిత్రాల్లో ఆ సరస్సు నేపాల్-టిబెట్ సరిహద్దుకు సమీపంలోని ఎత్తైన లెండే ఖోలా ప్రాంతంలో ఉన్నట్లు సంస్థ తెలిపింది.
సుమారు 20.25 హెక్టార్ల విస్తీర్ణంలో కొత్త నీటి మడుగు కనిపించిందని సుహోరా పేర్కొంది. ఆగస్టు 26న సంభవించిన వరదలతో ఈ కొత్త సరస్సు పరిణామాన్ని నిశితంగా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పింది. దాని విస్తీర్ణం, స్థిరత్వాన్ని ఉపగ్రహ చిత్రాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని చెప్పుకొచ్చింది. సరస్సు ఎలా ఏర్పడింది, దాని లోతు ఎంత, ఎంతవరకు స్థిరంగా ఉంది, దిగువ ప్రాంతాలకు ఏ స్థాయిలో ముప్పు ఉందనేది నిర్ధారించేందుకు మరిన్ని ఉపగ్రహ పరిశీలనలు, క్షేత్రస్థాయి అధ్యయనాలు అవసరమని సుహోరా టెక్నాలజీస్ తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి
సీఎన్‌జీ ధరలకు మళ్లీ రెక్కలు.. కిలోకు రూ.3.89 పెంపు..
తక్కువ స్పీడ్ బ్యాటరీ బైకులకు నో రూల్స్!