Share News

నేపాల్ వరదల్లో 275 మంది భారతీయుల గల్లంతు: విదేశాంగ మంత్రిత్వ శాఖ

ABN , Publish Date - Sep 04 , 2026 | 09:24 PM

నేపాల్‌లో ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. వరదల్లో ఇప్పటివరకు 166 మంది భారతీయులను రక్షించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. మరో 275 మంది భారతీయులు ఇంకా గల్లంతైనట్లు వెల్లడించింది.

నేపాల్ వరదల్లో 275 మంది భారతీయుల గల్లంతు: విదేశాంగ మంత్రిత్వ శాఖ
Nepal flash floods 275 Indians missing

ఇంటర్నెట్ డెస్క్: నేపాల్‌లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదల్లో 275 మంది భారతీయులు ఇంకా గల్లంతైనట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. గల్లంతైన వారి ఆచూకీ కోసం నేపాల్ ప్రభుత్వం, భారత విదేశాంగ శాఖతో పాటు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.

ఇప్పటివరకు నేపాల్‌లో 166 మంది భారతీయులను సురక్షితంగా రక్షించినట్లు ఆయన వెల్లడించారు. రక్షించిన వారి వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తున్నామని చెప్పారు. అలాగే చైనా నుంచి 1,907 మంది భారతీయులు సురక్షితంగా నేపాల్‌కు చేరుకున్నారని తెలిపారు. టిబెట్‌లో భారతీయ ప్రయాణికులు ఎవరూ చిక్కుకోలేదని చైనా అధికారులు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు.


నేపాల్‌కు భారత్‌ సాయం

వరదలతో తీవ్రంగా నష్టపోయిన నేపాల్‌కు భారత్‌ సహాయాన్ని కొనసాగిస్తోంది. నేపాల్ ప్రభుత్వం కోరిన మేరకు మరిన్ని ఫోరెన్సిక్ కిట్లు, బెయిలీ బ్రిడ్జిలు, ఇతర అవసరమైన సామగ్రిని పంపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జైస్వాల్ తెలిపారు. ఇప్పటివరకు ఏడు విమానాల ద్వారా సుమారు 95 టన్నుల సహాయక సామగ్రిని నేపాల్‌కు పంపినట్లు చెప్పారు. గురువారం కూడా 21 టన్నుల సహాయ సామగ్రితో రెండు భారతీయ విమానాలు కాఠ్మండుకు వెళ్లాయని తెలిపారు.

సహాయక, రెస్క్యూ చర్యలకు మద్దతుగా భారత్‌ 54 మంది నిపుణులను కూడా నేపాల్‌కు పంపిందన్నారు. ఇందులో 30 మంది టన్నెల్ రెస్క్యూ నిపుణులు, 19 మంది ఫోరెన్సిక్ నిపుణులు, ఐదుగురు వైద్య సిబ్బంది ఉన్నారని తెలిపారు. వీరంతా నేపాల్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని రణధీర్ జైస్వాల్ వెల్లడించారు.


Also Read:

పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌..

పోలీస్ స్టేషన్లలో CCTV విజువల్స్ మాయంపై తీవ్ర ఆగ్రహం!

Updated Date - Sep 04 , 2026 | 09:50 PM