Share News

పోలీస్ స్టేషన్లలో CCTV విజువల్స్ మాయంపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం!

ABN , Publish Date - Sep 04 , 2026 | 08:29 PM

పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ ఫుటేజ్‌ల సంరక్షణపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 18 నెలల పాటు భద్రపరచాల్సి ఉండగా, 15 రోజులు మాత్రమే ఎందుకు ఉంచుతున్నారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

పోలీస్ స్టేషన్లలో CCTV విజువల్స్ మాయంపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం!
Madras HC Seeks Report From Tamil Nadu DGP Over CCTV Preservation

చెన్నై, సెప్టెంబర్ 4: తమిళనాడులోని పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ (CCTV) ఫుటేజ్‌ల సంరక్షణపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పోలీస్ స్టేషన్లలోని సీసీటీవీ విజువల్స్‌ను 18 నెలల పాటు భద్రపరచాల్సి ఉండగా, 15 రోజులు మాత్రమే ఎందుకు భద్రపరుస్తున్నారో వివరణ ఇవ్వాలని తమిళనాడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(DGP)ని హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన కాలపరిమితిలో ఒక్క నిమిషం ఫుటేజ్ తగ్గినా అది అత్యున్నత నాయస్థాన ఉత్తర్వులను ఉల్లంఘించడమే అవుతుందని న్యాయమూర్తి జస్టిస్ వి.లక్ష్మీనారాయణన్ పేర్కొన్నారు.


కేసు నేపథ్యం

సేలం జిల్లాకు చెందిన ఏ.శరవణకుమార్ అనే ఓ సబ్-ఇన్‌స్పెక్టర్ తాను లంచం తీసుకోలేదంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ ఉల్లంఘన వెలుగులోకి వచ్చింది. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అనుమతించేందుకు తన నుంచి శరవణకుమార్ రూ.15,000 లంచం డిమాండ్ చేశారని శక్తివేల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 'డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్(DVAC)' అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకునేందుకు 2025 సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 మధ్య కాలానికి సంబంధించిన డీవీఏసి ఆఫీసు సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా రికార్డులను భద్రపరచాలని పిటిషనర్ హైకోర్టును కోరారు.


ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా, తమ వద్ద ఉన్న డిజిటల్ వీడియో రికార్డింగ్(DVR) వ్యవస్థలు సీసీటీవీ డేటాను 15 రోజులు మాత్రమే నిల్వ ఉంచుతాయని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సుప్రీంకోర్టు 'పరమ్‌వీర్ సింగ్ సేని వర్సెస్ బల్జీత్ సింగ్' కేసులో ఇచ్చిన స్పష్టమైన మార్గదర్శకాలను గుర్తుచేశారు. పోలీస్ స్టేషన్లు, విచారణ సంస్థల కార్యాలయాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను 18 నెలల పాటు భద్రపరచాలని, ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం, డీజీపీ కార్యాలయం కూడా గతంలో హామీ ఇచ్చాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.


హైకోర్టు ఆదేశాలు

డీజీపీ ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఆచరణలో కేవలం 15 రోజుల డేటా నిల్వ ఉంచడంపై న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విజిలెన్స్ ఆఫీసులలో 18 నెలలకు బదులుగా 15 రోజులే ఫుటేజ్ ఎందుకు ఉంచుతున్నారు? తమిళనాడు వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లలో ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్‌ను ఎంతకాలం భద్రపరుస్తున్నారు? ఈ అంశాలపై పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను సమర్పించాలని డీజీపీని ఆదేశిస్తూ, కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 10కి వాయిదా వేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

పిఠాపురం పాదగయలో సామూహిక వరలక్ష్మీ వ్రతం.. భారీగా తరలివచ్చిన మహిళా భక్తులు

ఈ ఏడాది తొలి విజయం.. జీఎస్ఎల్‌వీ-ఎఫ్17 మిషన్: ఇస్రో చైర్మన్ నారాయణన్

For More National News And Telugu News

Updated Date - Sep 04 , 2026 | 09:12 PM