పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు నోటిఫికేషన్..
ABN , Publish Date - Sep 04 , 2026 | 08:40 PM
నర్సింగ్ రంగంలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (NTRUHS) శుభవార్త చెప్పింది. 2026-27 విద్యా సంవత్సరానికి పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: నర్సింగ్‌లో కెరీర్ కొనసాగిస్తూ ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (NTRUHS) మంచి అవకాశం కల్పిస్తోంది. 2026-27 విద్యా సంవత్సరానికి రెండేళ్ల పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. కన్వీనర్ కోటాలో ఈ అడ్మిషన్లు చేపట్టనుంది. అర్హత ఉన్న పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు గడువు
పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 4న ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. అభ్యర్థులు సెప్టెంబర్ 15వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు దరఖాస్తు పూర్తి చేయాలి.
అర్హతలు ఇవే..
అభ్యర్థులు ఇంటర్మీడియట్ అలాగే గుర్తింపు పొందిన సంస్థలో జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ (GNM) కోర్సును విజయవంతంగా పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ కలిగి ఉండటం తప్పనిసరి. ఒకటిన్నర సంవత్సరాల MPHW కోర్సు పూర్తి చేసిన వారు ఈ ప్రవేశాలకు అర్హులు కారు.
వయసు
ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి అభ్యర్థికి కనీసం 21 సంవత్సరాల వయసు ఉండాలి. గరిష్ఠ వయోపరిమితిని యూనివర్సిటీ విధించలేదు. పురుషులు, మహిళలు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు
దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు కేటగిరీ ఆధారంగా ఫీజు చెల్లించాలి.
బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు: రూ.2,000
ఇతర (OC) అభ్యర్థులకు: రూ.2,500
ఎలా దరఖాస్తు చేయాలి?
అర్హత ఉన్న అభ్యర్థులు యూనివర్సిటీ అధికారిక ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలతో పాటు నర్సింగ్ సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు తమ అర్హతలను, అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. చివరి రోజు వరకు వేచి ఉండకుండా గడువులోగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని యూనివర్సిటీ సూచించింది.
Also Read:
రాత్రంతా మొబైల్ చూస్తున్నారా? నిద్రలేమితో ఈ ముప్పులు తప్పవు!
జీమెయిల్‌లో సరికొత్త ఏఐ ఫీచర్లు.. మాట్లాడితే పనైపోతుందంతే..