నీట్ పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ఎన్‌టీఏ సంస్కరణలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం..
ABN , Publish Date - Aug 19 , 2026 | 03:35 PM
నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారం, జాతీయ పరీక్షల సంస్థ (NTA)లో సంస్కరణలకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పరీక్షల నిర్వహణలో శాశ్వత, సమగ్ర సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని కోర్టు స్పష్టం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారం, జాతీయ పరీక్షల సంస్థ (NTA)లో సంస్కరణలకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పరీక్షల నిర్వహణలో శాశ్వత, సమగ్ర సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని కోర్టు స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణకు పటిష్ఠ వ్యవస్థ అవసరమని అభిప్రాయపడింది (NEET Paper Leak).
ఎన్‌టీఏలో చేపట్టిన సంస్థాగత సంస్కరణలు, ప్రశ్నపత్రాల భద్రత, పరీక్షల పారదర్శకత, సైబర్ భద్రత తదితర అంశాలపై పూర్తి వివరాలను అఫిడవిట్‌లో పొందుపరచాలని సుప్రీంకోర్టు కోరింది. కేవలం తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధే ధర్మాసనం ఈ వ్యవహారాన్ని విచారిస్తోంది. ఎన్‌టీఏలో సంస్కరణలను తాము పర్యవేక్షిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణలో పదేపదే తలెత్తుతున్న సమస్యలకు తాత్కాలిక పరిష్కారాలు కాకుండా వ్యవస్థాగత మార్పులు అవసరమని పేర్కొంది (Supreme Court NEET Hearing).
ఎన్టీఏను సంస్థాగతంగా బలోపేతం చేయాలని, నీట్ పరీక్షల భద్రతకు శాశ్వత కమిటీ అవసరమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది (NTA Reforms). విద్యార్థుల భవిష్యత్తు, విశ్వసనీయత కోసం ఎన్టీఏలో నిర్మాణాత్మక మార్పులు చేయాలని సూచించింది. నీట్-2026 ప్రశ్నపత్రం లీక్ నేపథ్యంలో పరీక్ష రద్దు చేయాల్సి రావడం, విద్యార్థులు ఎదుర్కొన్న ఇబ్బందుల తర్వాత ఎన్టీఏ పనితీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎన్టీఏలో శాశ్వత సంస్కరణలు అమలు చేయడంపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది.
Also Read:
నటి నిధి అగర్వాల్ ప్రమోట్ చేసిన యాప్స్‌పై ఈడీ దర్యాప్తు ముమ్మరం
10 ఏళ్ల నిరీక్షణకు తెర.. కేరళ మహిళతో స్కాట్లాండ్ రాజకీయ నేత పెళ్లి